గూడూరు, ఫిబ్రవరి 7 : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గిరిజన గురుకుల పాఠశాలలో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురు విద్యార్థులు సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. 9వ తరగతిసాయిప్రసాద్, 7వ తరగతిలాకవత్ రాహుల్, బానోత్ అనిల్, బానోత్ యాకూబ్ గురువారం సాయంత్రం హాస్టల్లో ఇచ్చిన స్నాక్స్ (బొబ్బర గుగ్గిల్లు) తిన్నారు. రాత్రి భోజనంలో కర్రీ, సాంబారుతో అన్నం తిని పడుకున్నారు. రాహుల్, సాయిప్రసాద్‌కు రాత్రి నుంచి విరోచనాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారే సరికి నీరసించిపడిపోవడంతో గమనించిన తెలుగు ఉపాధ్యాయుడు సీహెచ్‌సీకు శుక్రవారం తీసుకెళ్లి చికిత్స చేయించాడు. మరోగంట అనంతరం అనిల్, యాకూబ్ కూడా విరోచనాలు కావడంతో దవాఖానకు తరలించారు. మండల ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి శ్రీనివాసరావు ఆశ్రమ పాఠశాలను సందర్శించి, నలుగురికి మాత్రమే విరోచనాలు అవుతున్నాయని తెలిపారు. విద్యార్థులను ఎమ్మెల్యే మురళీనాయక్, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ పరామర్శించారు.