Vemulawada | కరీంనగర్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల పంపిణీ, అక్రమాల వ్యవహారంపై సాగతీత కొనసాగుతున్నది. ఈ కుంభకోణంపై ఒకవైపు పోలీసులు, మరోవైపు దేవాదాయ శాఖాధికారులు ఆచీతూచి అడుగులేస్తున్నారు. అసలు వాస్తవాలు బయటకు రాకుండా కొందరు ప్రభుత్వ పెద్దలే సంబంధిత అధికారులపై ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దశలో ప్రజలు, ముఖ్యంగా భక్తలు నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది.
‘రాజన్న కోడెలు కోతకు?!’ శీర్షికన శనివారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ప్రచురించిన కథనం సంచలనం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మం త్రి అనుచరుడైన రాంబాబుకు 60 కోడెలు ఇచ్చినట్టు గీసుకొండ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు, ఆలయ అధికారులు చెప్తున్న పొంతన లేని సమాధానాలు, మంత్రి కొండా సురేఖ లేఖ వంటి పలు అంశాలను కండ్లకు కట్టినట్టు ‘నమస్తే’ వివరించింది. ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో బీఆర్ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో వేములవాడలోని ఈవో కార్యాలయం ఎదుట ఆందోళనలు కొనసాగాయి.
ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ నిమిత్తం వేములవాడ పోలీసులకు వివరాలిస్తామని వెల్లడించారు. ఈ కథనంపై మంత్రి కొండా సురేఖ కూడా స్పందించారు. దరఖాస్తు పరిశీలన నిమిత్తం లేక పంపినట్టు ఒప్పుకున్న మంత్రి.. ఆ వెంటే అందులో ఎటువంటి అక్రమాలు జరగలేదంటూ ముందస్తుగానే సర్టిఫికెట్ ఇవ్వడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసు వ్యవహారం కొలిక్కి రాకముందే, మంత్రి ముందుగానే ఎలా ప్రకటిస్తరన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజానికి భక్తుల నమ్మకాలతో ముడిపడిన ఈ సున్నిత అంశాన్ని 24 గంటల్లో తేల్చే అవకాశమున్నా సాగదీస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మనుగొండకు చెందిన మాదాసి రాంబాబు వేములవాడ దేవస్థానం నుంచి కోడెలను తీసుకెళ్లి, వాటిని కోతకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నాడని కొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గీసుకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తమకు వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని, 60 కోడెలు తెస్తే అందుల్లో 11 మాత్రమే ఉన్నాయని, మిగిలిన 49 లేకపోవడంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని సీఐ మహేందర్ స్వయంగా చెప్పిన విషయం మీడియాలో వచ్చింది. ఈ విషయంలో పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా రాజన్న ఆలయ అధికారులను కోరినట్టు సీఐ తెలిపారు.
ఈ మేరకు అధికారులు ఒక బృందాన్ని ఏర్పాటుచేసి, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను గమనించి నిజానిజాలను నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉన్నది. కానీ, ఈ కోణంలో ఆలయ అధికారులు అడుగులే వేయలేదు. భక్తుల నమ్మకాలతో కూడుకున్న ఇటువంటి సమస్య ఎదురైనప్పుడు యుద్ధప్రాతిపదికన తేటతెల్లం చేయాలి. కానీ, ఈ విషయంలో తీవ్రమైన సాగదీత ధోరణి కనిపిస్తున్నది. ఈనెల 29న కేసు నమోదైతే ఇప్పటివరకు వాస్తవాలు బయటకే రాలేదు. మం త్రితోపాటు ఈవో ఇచ్చిన వివరణలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
‘రాజన్న కోడెలు కోతకు?!’ శీర్షికన శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురించిన కథనంపై స్పందించిన రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శనివారం ఒక ప్రకటన జారీచేశారు. దరఖాస్తును అధికారులకు పంపించింది వాస్తవమేనని ఒప్పుకున్న మంత్రి, ఈ వ్యవహారంలో ఎక్క డా అవకతవకలు, అక్రమాలు జరగలేదని ముందుగానే సర్టిఫికెట్ ఇచ్చేశారు. మంత్రి ఈ ప్రకటనను నిశితంగా పరిశీలిస్తే అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మాదాసి రాంబాబుపై గీసుకొండ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుపై విచారణ చేపట్టామని, పూర్తి వివరాల కోసం రాజన్న ఆలయానికి లేఖ రాశామని సీఐ మహేందర్ తెలిపారు.
పోలీసులు అడిగిన వివరాలను శనివారం పంపిస్తున్నట్టు ఆలయ ఈవో మీడియా సాక్షిగా వెల్లడించారు. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపేందుకు వేములవాడ పోలీసులను అశ్రయిస్తామని శనివారం మీడియా సాక్షిగా ఆలయ ఈవో వివరించారు. అంటే ఈ వ్యవహారంలో ఇంకా నిజానిజాలు బయటకు రాలేదని సుస్పష్టమవుతున్నది. వాస్తవలను నిగ్గు తేల్చేందుకు అటు గీసుకొండ పోలీసులు, ఇటు రాజన్న ఆలయ ఈవో ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్థమవుతున్నది.
విచారణ జరిగి వాస్తవాలు ఏమిటో అధికారులు చెప్తే తప్ప కోడెల విక్రయాలు జరిగాయా?లేదా? అన్నది తేలనున్నది. అలాగే ఎక్కడ తప్పులు జరిగాయన్న విషయాలు బయటఒచ్చే అవకాశమున్నది. ఇవేవీ జరగకుండానే మంత్రి సురేఖ ఎటువంటి అక్రమాలు జరగలేదంటూ ప్రకటన జారీచేసి ముందస్తుగానే సర్టిఫికెట్ ఇవ్వడం వెనుక ఉద్దేశమేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విచారణ పూర్తికాక ముందే మంత్రి ఈ ప్రకటన చేయడాన్ని బట్టి చూస్తే ఈవిషయంలో విచారణ ముందుకెళ్తుందా? లేదా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజానిజాలు బయకు రావాలంటే నిష్పాక్షికంగా విచారణ జరగాలన్న డిమాండ్ వస్తున్నది. అవసరమైతే ఒక ప్రత్యేకాధికారిని నియమించి విచారణ చేస్తే వాస్తవాలు బయటకొస్తాయని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
భక్తులు సమర్పించిన కోడెల నిర్వహణ నిమిత్తం విధివిధానాలను రూపొందించేందుకు 6 నెలల క్రితం మేలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, వేములవాడ ఆలయ ఈవో కన్వీనర్‌గా, పలువురు ఇతర సభ్యులతో ఏర్పాటుచేసిన కమిటీ మార్గదర్శకాలను రూపొందించి జీవో విడుదల చేసినట్టు మంత్రి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కానీ, మాదాసి రాంబాబు ఆగస్టు 12న దరఖాస్తు పెట్టుకోగా, ఆగస్టు 16న మంత్రి ఆ దరఖాస్తు ను ఎండార్స్మెంట్ చేశారు.
అందులో మరో విశేషమేమిటంటే.. రాంబాబు రైతు పేరిట దరఖాస్తు చేయలేదు. తనకు గోశాల ఉన్నదని, వేములవాడ, యాదాద్రి ఆలయాల నుంచి కేటాయింపులు జరిగేలా చూడాలని అందులో కోరారు. మంత్రి చెప్పినట్టు ఆరు నెలల క్రితం జీవో విడుదల చేస్తే.. ఆగస్టులో పెట్టుకున్న రాంబాబు దరఖాస్తును అధికారులకు ఎలా ఫార్వర్డ్ చేశారు? రైతులకు ఇవ్వాలని స్పష్టంగా జీవోలో ఉన్నప్పుడు.. శ్రీరాజేశ్వర సొసైటీ పేరిట నడుపుతున్నట్టు చెప్పిన గోశాలకు ఇవ్వాలన్న దరఖాస్తును ఎలా అంగీకరించారు?
ఒక వేల మాదాసి రాంబాబు ఒకవేళ రైతు అని అనుకున్నా.. వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టామని, 60 కోడెలు తెస్తే అందులో 11 మాత్రమే ఉన్నాయని, మిగిలిన 49 లేకపోవడంతో కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నామని సీఐ మహేందర్ స్వయంగా చెప్పారు. నిబంధనల ప్రకారమే ఇచ్చారని మంత్రి చెప్తున్నారు. మరి రాంబాబు 60 కోడెలు తెచ్చారని పోలీసులెలా చెప్పారు? అందులో ఏది అబ ద్ధం? ఏదీ నిజం? ప్రతి కోడెకు ట్యాగింగ్ ఉన్నదని మం త్రి, అధికారులు చెప్తున్నారు. ఎంత మంది రైతులకు ఇచ్చారో? వాటి వివరాలు, ట్యాగుల వివరాలు బయటకు ఇవ్వడానికి అధికారులు ఎందుకు జంకుతున్నారో చెప్పాలన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వేములవాడ, డిసెంబర్ 7: ‘రాజన్న కోడె లు కోతకు?!’ వార్త తెలిసి వేములవాడ పట్ట ణం అట్టుడికింది. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు ఆందోళనలు కొనసాగాయి. రాజన్న ఆలయ ఈవో కార్యాలయం వద్ద నిరసనలకు దిగారు. ‘నమస్తే’ కథనాలను చేత పట్టుకొని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజన్న భక్తులు స్వామివారికి సమర్పించిన నిజ కోడెలను నిబంధనలకు విరుద్ధంగా ఎలా కేటాయిస్తారని, మంత్రి సిఫారసుతో ఒకే వ్యక్తికి 60 కోడలు ఎలా ఇచ్చారని నాయకులు మండిపడ్డారు.
భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఎలా కేటాయించాంటూ అధికారులను ప్రశ్నించారు. కోడెలను కోతకు సంబంధించిన వ్యక్తికి ఇచ్చి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని మంత్రిపై మండిపడ్డారు. వెంటనే మంత్రి సురేఖను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఈవో వినోద్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నిరసనలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, కౌన్సిలర్లు మారం కుమార్, నిమ్మశెట్టి విజ య్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, నాయకులు రామతీర్థపు రాజు, ముద్రకోల వెంకటేశం, వెంగళ శ్రీకాంత్‌గౌడ్ వెంకట్‌రెడ్డి, రవీందర్, రాధాకిషన్‌రావు, వాసాల శ్రీనివాస్, ప్రేమ్ చారి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ పట్టణ అధ్యక్షుడు రేగుల సంతోష్‌బాబు ఆధ్వర్యంలో ‘నమస్తే కథనం’, మంత్రి సిఫారసు చేసిన లేఖను చూపుతూ ఈవో కార్యాలయం గదిలోనే బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. 2 గంటలపాటు కార్యాలయంలోనే కూర్చొని కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పే వరకు తాము లేవబోమని భీష్మించుకొని కూర్చున్నారు. ఈవో ను కూడా సస్పెన్షన్ చేయాలని ఏఈవో శ్రవణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో బీజేపీ నాయకులు నామాల శేఖర్, రాజ్‌కుమార్, హనుమాన్లు, సగ్గు రాహుల్ పాల్గొన్నారు.
గీసుకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందని, ఆ మేరకు పోలీసులు వివరాలు అడిగారని, దానికి అనుగుణంగా నివేదిక తయారు చేసి పంపిస్తున్నామని చెప్పిన ఈవో.. ఆ వెం టనే మాటమార్చారు. నిజానికి రాంబాబు వద్ద ఉన్న కోడెలు వేములవాడ దేవస్థానానికి చెందినవా? లేక బయట నుంచి తెచ్చి పెట్టుకున్నారా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదంటూ దాటవేశారు. గతంలోనూ ఫిర్యాదులొచ్చాయనీ చెప్పారు. రైతులకు ఇచ్చిన కోడెలు కనిపించడం లేదని ఫిర్యాదులు వస్తే వెంటనే సిబ్బందిని పంపించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయడంతోపాటు వివరాలు ఇవ్వాలని పోలీసులే స్వయంగా లేఖ రాసినా నేటికీ దేవాదాయ శాఖ ఎందుకు విచారణ చేయలేదన్న దానికి సమాధానమే లేదు. ఆయన మాటల్లో సాగదీసే ధోరణి కనిపిస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి.
రాజన్న ఆలయానికి చెందిన కోడెల పంపిణీ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి. నిబంధనల పేరుతో ఒకే వ్యక్తికి 60 కోడేలు ఎలా కేటాయించారు. అవకతవకలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ కార్యకర్తకే కోడెలు కేటాయించే తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నది. విచారణ పూర్తికాకుండానే అక్రమాలు జరగలేదంటూ మంత్రి ఎలా చెప్తారు.
-మనోహర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు
రైతులకు అందించిన రాజన్న కోడెల విషయంపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం. ఈ మేరకు వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనంతోపాటు అందులోని వాస్తవాలు, రైతులకు ఇచ్చిన కోడెలు, వాటి పరిస్థితుల వంటి అంశాలను పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు పోలీసులకు సమర్పిస్తాం. కోడెలకు వేసిన ట్యాగ్ వివరాలు, అలాగే రైతులు వివరాలతో కూడిన నివేదిక మొత్తాన్ని అందిస్తాం. ఏమైనా తప్పులు జరిగి ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మా నివేదికలో పోలీసులను కోరుతాం.
– వినోద్, వేములవాడ రాజన్న ఆలయ ఈవో
సాక్షాత్తూ పశువుల వ్యాపారిగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తకు కోడెలు ఇవ్వాలని సిఫారసు లేఖ ఇచ్చిన మంత్రి కొండా సురేఖను ప్రభుత్వం వెంటనే మంత్రిని బర్తరఫ్ చేయాలి. కోడెల వ్యవహారంలో జరిగిన అవకతవకలను వెలికి తీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆలయ ఈవోను సస్పెండ్ చేసే వరకు తాము నిరంతరం పోరాటం చేస్తాం.
-రేగుల సంతోష్‌బాబు, బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు, వేములవాడ
హైదరాబాద్, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ): వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని కోడెలను నిబంధనల ప్రకారం ఒక రైతుకు రెండు చొప్పున ఇస్తున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. సాధారణంగా తన వద్దకు వచ్చే దరఖాస్తులను పరిశీలించాల్సిందిగా సంబంధింత అధికారులకు సూచిస్తుంటామని, కోడెల పంపిణీకి సంబంధించి వచ్చిన దరఖాస్తులను కూడా అదే విధంగా పంపించామని ఆమె పేర్కొన్నారు. దేవస్థానం అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే రైతులకు కోడెలను పంపిణీ చేశారని, అక్రమాలు జరగలేదని ఆమె పేర్కొన్నారు. ‘రాజన్న కోడెలు కోతకు’ శీర్షికతో శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి మంత్రి సురేఖ స్పందింస్తూ, ఆదివారం వివరణ ఇచ్చారు. ఆరు నెలల క్రితం ఏర్పాటైన కమిటీ రూపొందించిన మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని తెలిపారు. నిబంధనల ప్రకారం ఒక్కో రైతుకి రెండు కోడెల చొప్పున ఇస్తున్నామని పేర్కొన్నారు.