Sand Mafia | కరీంనగర్, జనవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి/వీణవంక): కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు ఇసుక క్వారీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. నిబంధనల ఉల్లంఘన, రైతులకు జరిగిన నష్టం వంటి అంశాలపై నిగ్గు తేల్చాల్సిన అధికార యంత్రాగం, గడిచిన మూడు రోజులుగా నాన్చుడు ధోరణిని అవలంబిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు విచారణ సాగుతుండగా మరోవైపు రైతులు వేసిన అడ్డుకట్టను క్వారీ నిర్వాహకులు తొలగించి యథేచ్ఛగా ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై రైతుల మొర అరణ్యరోదనగానే మారుతుండగా, కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు శనివారం ఎనిమిది విభాగాల అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరిపారు.
నివేదికను కలెక్టర్కు పంపుతామని, వారి నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ఈ దశలో తమకు న్యాయం జరుగుతుందా? లేదా? అన్న మీమాంస రైతుల నుంచి వ్యక్తమవుతున్నది. చల్లూరు ఇసుక క్వారీలో జరుగుతున్న అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన, రైతులకు జరిగిన అన్యాయం, బావుల పూడ్చివేత వంటి అనేక అంశాలను ఎండగడుతూ ఈ నెల 14న ‘బావులు పూడ్చి.. బోర్లు కూల్చి.. మానేరులో ఇసుక దందా!’, ఇదే నెల 15వ తేదీన ‘ఇసుక దందాకు రైతుల అడ్డుకట్ట’ అనే శీర్షికల పేరిట వరుస కథనాలు ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ప్రచురితమయ్యాయి.
వాస్తవంగా 15 రోజుల క్రితమే ప్రజావాణితో పాటు పలువురు ఉన్నతాధికారులకు రైతులు ఫిర్యాదులు చేసినా ఎటువంటి స్పందన రాలేదు. బాధిత రైతులందరూ కలిసి ఇసుక క్వారీలోకి వాహనాలు వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో నాలుగు రోజులు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతోపాటు ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాలు రావడంతో ఈ నెల 14న సాయంత్రం వీణవంక ఎస్ఐ ఆవుల తిరుపతి బాధిత రైతులకు సమాచారం ఇచ్చి క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. తిరిగి ఈ నెల 16న కరీంనగర్ జిల్లా మైనింగ్ ఏడీ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఆర్డబ్ల్యూఎస్, టీజీఎండీసీ అధికారులు క్వారీకి వెళ్లి విచారణ జరిపారు. ఈ అధికారులు మాత్రం బాధిత రైతులకు సమాచారం ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదే రోజు సాయంత్రం హుజూరాబాద్ ఏసీపీ మాధవి వెళ్లి విచారణ చేశారు.
రైతులకు సమాచారం ఇచ్చిన ఆమె.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒకవైపు విచారణ కొనసాగుతుండగానే, రైతులు ఇసుక క్వారీలోకి వాహనాలు రాకుండా వేసిన అడ్డుకట్టను శనివారం ఉదయం క్వారీ నిర్వాహకులు తొలగించి యథావిధిగా ఇసుక రవాణా చేపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రైతులు మళ్లీ అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు విచారణ సాగుతుండగా, మీరు ఎలా అడ్డుకట్ట తొలగిస్తారంటూ? రైతులు వారితో వాదనకు దిగారు. ఇదే సమయంలో రైతులు ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫోన్లు చేసి సమాచారం ఇచ్చారు. క్వారీ నిర్వాహకులు అడ్డుకట్టను తొలగించి, తమను ఇబ్బందులు పెడుతున్నారంటూ ఫోన్లో ఆవేదన వ్యక్తం చేశారు.
గడిచిన మూడు రోజులుగా వేర్వేరు విభాగాల అధికారులు వేర్వేరు సమాయాల్లో వచ్చి విచారణ చేసి వెళ్లారు. కానీ శనివారం మాత్రం కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు దాదాపు ఎమిమిది శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. హుజూరాబాద్ ఆర్డీవో రమేశ్, మైనింగ్ ఏడీ రాఘవరెడ్డి, ఏడీఏ సునీత, ఇరిగేషన్ ఏఈఈ సుబ్బరామిరెడ్డి, అసిస్టెంట్ హైడ్రాలజిస్టు బీ ఉమాదేవి, జియాలజిస్టు వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ జియాలజిస్టు కర్ణ ప్రసన్న, సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ తిరుపతితోపాటు భూగర్భజల శాఖలాంటి పలు విభాగాలకు చెందిన అధికారులు ఈ విచారణలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులకు జరిగిన నష్టం విషయంలో ముందుగా విచారణ చేశారు. ఈ సమయంలో ఓ అధికారి మాట్లాడిన మాటలపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘మానేరు వాగులో బావులు తవ్వుకోవడానికి మీకు అనుమతి ఎవరిచ్చారు? కరెంటు మంజూరు ఎలా ఇచ్చారు?’ అంటూ అడిగిన ప్రశ్నలతో రైతులు కంగుతిన్నారు. సహజ వనరులను వినియోగించుకునే హక్కు తమకు లేదా? అంటూ రైతులు ఎదురు ప్రశ్నలు వేయడంతో సదరు అధికారి సర్దుకున్నారు.
అనంతరం రైతులకు జరిగిన నష్టాన్ని తెలుసుకొని నమోదు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో తిరిగి క్వారీ ఎక్కడి వరకు ఉన్నదన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. క్వారీ హద్దులను సూచిస్తూ జెండాలు ఎప్పుడు పాతారంటూ ప్రశ్నించగా, గతంలో ఇవి లేవని, ఒక రోజు క్రితమే పాతారని రైతులు చెప్పారు. వివిధ విభాగాల యంత్రాగం కదిలినా ఏ ఒక్క అంశంలోనూ అక్కడ రైతులకు క్లారిటీ ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. నిజానికి సదరు క్వారీ యజమాని ఉల్లంఘించిన నిబంధనలనపై ఏ ఒక్క అధికారి మాట్లాడలేదు. అలాగే హద్దుల విషయంలోనూ నిగ్గు తేల్చకుండా అధికారులు నాన్చుడు ధోరణితో వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకే విచారణకు వచ్చామని, తాము గుర్తించిన అంశాలను నివేదిక రూపంలో అందజేస్తామని విచారణ అధికారులు చెప్పారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలను బట్టి ఆయా విభాగాల అధికారులు చర్యలు తీసుకుంటారని అంటున్నారు. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి కలెక్టర్ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నది. ప్రధానంగా బావుల పూడ్చివేత ద్వారా రైతులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు కలెక్టర్ చర్యలు తీసుకుంటారా? లేదా? ఇప్పటికైనా సదరు క్వారీ నిర్వాహకులకు ఇచ్చిన హద్దులను పక్కాగా నిర్ధారించి భవిష్యత్తులో వివాదాలకు తావు లేకుండా చేస్తారా? లేదా? అలాగే ఇసుక తవ్వకాల్లో నిబంధనలు ఉల్లంఘించిన తీరుపై ఏమైనా చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నది తేలాల్సి ఉన్నది.
ఒకవైపు విచారణ కొనసాగుతుండగా అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే రైతులు వేసిన అడ్డుకట్టను క్వారీ యజమానులు తొలగించి ఇసుక రవాణా చేస్తున్న తీరును ఏ కోణంలో చూస్తారు? ప్రస్తుతం ఇచ్చిన అధికారుల నివేదికపైనే ఆధారపడుతారా? లేక విజిలెన్స్ విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చల్లూరు, ఇప్పలపల్లి గ్రామ రైతులకు వివరించి భూగర్భజలాలకు ఇబ్బందులు లేకుండా, రైతులకు జరిగిన అన్యాయం వంటి అంశాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత రెండురోజులుగా ఇసుక రవాణా, రైతుల అభ్యంతరాలపై విచారణ జరుగుతున్నది. వివిధ విభాగాల అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి విచారణ చేసి వెళ్లారు. సదరు అధికారులు.. పోలీసులు సీపీ గౌస్ ఆలంకు, మైనింగ్ అధికారులు కలెక్టర్ పమేలా సత్పతికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. కానీ ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు రాకుండానే ఏకంగా క్వారీ నిర్వాహకులు అడ్డుకట్టను తొలగించి, ఇసుక రవాణాను యథావిధిగా కొనసాగించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మాత్రం దానికి అధికారులు వచ్చి విచారణ జరుపడం వల్ల జరిగిన లాభం ఏమిటి అన్న విమర్శలు వస్తున్నాయి.