సిద్దిపేట, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట జిల్లా మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తోడేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు (రహదారికి) అడ్డుగా ఉన్న చెక్‌డ్యామ్‌లను సైతం ధ్వంసం చేస్తున్నారు. దీంతో చెక్‌డ్యామ్‌లకు ప్రమాదం పొంచి ఉన్నది. మరోవైపు, ఇసుక మాఫియా ఆగడాల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి వరి పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులతోపాటు అధికార పార్టీ నాయకుల అండదండలు లభించడంతో ధూళిమిట్ట, మద్దూరు, నంగునూరు మండలాల్లో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. తాజాగా నంగునూరు మండలం ఘనపూర్, ధూళిమిట్ట మండలం జాలపల్లి గ్రామ శివారులోని మోయతుమ్మెద వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్ తమకు అడ్డుగా ఉన్నదని భావించిన ఇసుక మాఫియా దానిని కొంత మేర ధ్వంసం చేసింది. వాగులోనికి ఇసుక ట్రాక్టర్లు పోయి రావడానికి వీలుగా రహదారిని ఏర్పాటు చేసుకొని రాత్రింబవళ్లు ఇష్టారీతిగా ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు.
వాస్తవానికి చెక్‌డ్యామ్ నిర్మాణం చేసిన పరిధిలో ఎలాంటి ఇసుక తవ్వకాలూ చేయరాదు. అలా చేయడం వల్ల చెక్‌డ్యామ్‌లకు ప్రమాదం పొంచి ఉంటుంది.ఈ విషయం అధికారులకు తెలిసినా నిమ్మకు నీరెత్త్తినట్టు వ్యవహరిస్తున్నారు. మామూళ్లకు అలవాటు పడిన అధికారులు ఇసుక మాఫియాకు పూర్తిగా సహకారం అందిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. పంట పొలాల్లో రహదారులు ఏర్పాటు చేశారు. ఎదురు తిరిగిన రైతులకు ‘మీకు డబ్బులు ఇస్తాం.. తీసుకొని గమ్మన ఊకోండి.. మాకు అడ్డు చెప్తే రూపాయి కూడా రాదు’ అంటూ బెదరింపులకు దిగుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల అండతోనే ఇసుక మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నదని వాగు పరీవాహక ప్రాంత రైతులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేసినా వారు మౌనంగా ఉండిపోతున్నారు. దీనికితోడు అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతల అండదండలు కూడా ఉన్నట్టు సమాచారం.

రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులకు మామూళ్లు ఇవ్వడానికి ఇసుక మాఫియా ఒక్కో ట్రాక్టర్ వద్ద నుంచి నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆ మొత్తాన్ని అధికారులకు మూడు వాయిదాల్లో అంటే పది రోజులకోసారి ముట్టజెప్పుతున్నట్టు తెలిసింది. ఇలా వచ్చిన డబ్బులను అధికారులు వాటాల ప్రకారం పంచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇసుక అక్రమ రవాణాపై ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా ధూళిమిట్ట మండలం జాలపల్లి, నంగునూరు మండలం ఖాతా, ఘణపూర్, పెద్దొళ్ల బావి, అక్కెనపల్లి, కోహెడ మండలం బస్వాపూర్ ప్రాంతాల్లో జోరుగా ఇసుక అక్రమ రవాణా సాగుతున్నది.
మోయతుమ్మెద వాగు పరీవాహక ప్రాంతం ఎంతవరకు ఉన్నదో అంతవరకు ఎక్కడికక్కడ ఇసుకను తోడేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా కోసం వాగులోనే ప్రత్యేకంగా రహదారులను సైతం ఏర్పాటు చేసుకున్నారు. బాట కోసం కొంత మేర సంబంధిత భూ యజమానులకు దూరాన్ని బట్టి డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. ఇసుక ట్రాక్టర్లలో నింపడానికి మ్యాన్ పవర్‌తో ఆలస్యం అవుతుందని రాత్రివేళల్లో ఏకంగా జేసీబీలతో ట్రాక్టర్లలో నింపేస్తున్నారు. రాత్రివేళ చూస్తే వాగులో ఇసుక జాతరను తలపిస్తుంది. ఆ సమయంలో అక్కడికి రైతులు వెళ్లి ఇదేమిటని ప్రశ్నిస్తే.. ఇసుక మాఫియా బెదరింపులకు దిగుతున్నదని రైతులు వాపోతున్నారు. దీంతో తాము ఏమీ చేయలేక ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా, ఆ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు తూతూ మంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకొంటున్నారని వాగు పరీవాహక ప్రాంత రైతులు చెప్తున్నారు.

వాగు పరీవాహక ప్రాంతం నుంచి ఇసుకను తోడేయడంతో రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఇసుక అక్రమ రవాణా చేయడం వల్ల ఇసుక వ్యాపారులకు భారీగా డబ్బులు వస్తుండగా, రైతులకు మాత్రం కన్నీళ్లు మిగులుతున్నాయి. అసలే వరి పొట్ట దశలో ఉన్నది. ఈ సమయంలో వరికి తగినంత నీరు కావాలి. ఎంత నీళ్లు ఉంటే అంత దిగుబడి వస్తుంది. కానీ, ప్రస్తుతం వాగు పరీవాహక ప్రాంతంలో అలాంటి పరిస్థితులు లేవు. ఇసుక అక్రమ రవాణతో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. దీంతో వరి పొలాలకు నీరు సరిపోవడం లేదు. ఇష్టానుసారం ఇసుక తీయడంతో వాగులో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. బోరు బావుల్లో నీరు తగ్గుముఖం పట్టింది. పంటలు ఎండిపోతున్నాయని వాగు పరీవాహక ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో అధిక పెట్టుబడులతో సాగు చేసిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.