పెద్దపల్లి, మే 21(నమస్తే తెలంగాణ): డీసిలిటేషన్ పేరిట ఇసుక తవ్వకాలు చేపట్టడం చట్ట విరుద్ధమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ మంగళవారం తీర్పు వెలువరించింది. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల పరిధిలోని మానేరు నదీ తీరంలో నిర్మిస్తున్న చెక్‌డ్యాంల బ్యాక్ వాటర్ ఏరియాల్లో గల ఇసుకను తీసేందుకు ప్రభుత్వం 25 ఇసుక క్వారీలకు అనుమతిచ్చింది. ఈ నిర్ణయంపై అభ్యంతరం తెలుపుతూ పలువురు పర్యావరణ ప్రేమికులు ఎన్జీటీని ఆశ్రయించా రు.
ఈ నేపథ్యంలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వు లు జారీ చేసింది. అయినా.. ఇసుక క్వారీల నిర్వహణ, డీసిలిటేషన్ ఆగకపోవడంతో తాజాగా చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్ సంచలన తీర్పును వెలువరించింది. తీర్పు అమలులో యంత్రాంగం నిర్లక్ష్యం వహించినందుకు ఇరిగేషన్, మైనింగ్ శాఖలకు చెరో రూ.25 కోట్ల జరిమానా విధించింది. 3 నెలల్లోపు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు చెల్లించాలని, మానేరులో పూర్తి స్థాయి లో ఇసుక తవ్వకాలను నిలిపివేసేందుకు చర్యలను తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. అమలు నివేదికను సమర్పించేందుకు ఈ కేసు విచారణను సెప్టెంబర్ 23కు వాయిదా వేసింది.