Manne Krishank | పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ గతంలో మంత్రి హోదాలో వచ్చి కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ఇసుక పాలసీని ప్రశంసించారని, తమ రాష్ట్రంలోనూ ఈ పాలసీని ప్రవేశపెడతామని చెప్పినట్లుగా బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ గుర్తు చేశారు చేశారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఇసుక అక్రమ దందా పెరిగిందని, తద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయం తగ్గిందని ఆరోపించారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొత్త ఇసుక పాలసీతో ప్రతీ ఏడాది రూ.800 కోట్లకుపైగా ఆదాయం వచ్చిందని. ఉమ్మడి రాష్ట్రంలో ఇసుకపై ఆదాయం ఏడాదికి రూ.19 కోట్లు కూడా దాటలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఇసుక ఆదాయం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి జేబులోకి వెళ్తోందన్నారు.
ఎనుముల కొండల్ రెడ్డి ఇసుక మాఫియాతో రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందని.. ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక పేరుతో టన్నుల కొద్దీ ఇసుకను తరలించి అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ బారేజీతో పాటు కొన్ని ప్రాజెక్టుల దగ్గర నీళ్లు ఖాళీ చేసి మరీ ఇసుకను తరలిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక అంతా ఎక్కడికి వెళ్తోందని.. లారీల అసోసియేషన్ కూడా ఓవర్ లోడింగ్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇసుక పై రివ్యూ చేస్తే అవినీతి తగ్గించడానికి అనుకున్నామని.. అయితే అలాంటి చర్యలు తీసుకోకపోగా పెంచేందుకు బాటలు వేశారని మండిపడ్డారు. మూడు షిఫ్ట్‌ల్లో ఇసుక మైనింగ్ చేయాలనీ తాజా మినరల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వ పర్యావరణ నిబంధనలకు విరుద్ధమన్నారు.
24 గంటల ఇసుక మైనింగ్ రేవంత్ రెడ్డి కుటుంబ ఆదాయం పెంచడానికే తప్ప.. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు కాదన్నారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు ఈ ఏడాదిలో ఐదుగురు ఎండీలు మారారని.. రేవంత్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి జరిగిన ఇసుక అమ్మకాలన్నీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఈ అంశాన్ని లేవనెత్తుతుందన్నారు. స్పీకర్ సమక్షంలో ఇసుక రికార్డులన్నీ బయట పెట్టాలని.. రేవంత్ అధికారంలోకి వచ్చాక రూ.200 కోట్ల మేర ప్రభుత్వానికి ఇసుక ఆదాయం తగ్గిందన్నారు. ఇసుకపై రూ.800కోట్ల టార్గెట్ కోసం నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఇసుకపై పదేండ్లలో రూ.5,900 కోట్ల ఆదాయం వచ్చిందని.. అప్పుడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇసుక మైనింగ్ జరిగేదని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఇసుక అక్రమ దందాలపై మరిన్ని వివరాలు త్వరలోనే బయట పెడుతానని స్పష్టం చేశారు.