Sand Mafia | మహబూబ్‌నగర్, మే 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణానదిలో ఇసుక దొంగలు పడ్డారు. అధికార పార్టీ అండదండలతో ఏకంగా నదిలో రోడ్లు నిర్మించి రాత్రింబవళ్లు అక్రమంగా కర్ణాటకకు ఇసుకను తరలిస్తున్నారు. సుమారు నాలుగు ప్రాంతాల్లో ఈ ఇసుక దందా కొనసాగుతున్నది. ఏకంగా నదిలో నాలుగు చోట్ల హిటాచీలను దింపి పెద్దపెద్ద టిప్పరల్లో ఇసుకను నింపి తరలిస్తున్నారు. వీళ్లు ఇచ్చే మామూళ్లు రోజుకు రూ.నాలుగు లక్షలు ఉంటుందని ప్రచారం జరుగుతున్నది. ‘మా వద్దకు ఎవరు వచ్చినా మామూళ్లు ఇచ్చి మేనేజ్ చేసుకుంటున్నాం.
మమ్మల్ని ఎవరు ఏం పీకలేరు’ అని వారు బాహాటంగా చెప్తున్నారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల గ్రామ సమీపంలో ఈ ఇసుక దందా జోరుగా సాగుతున్నది. వేసవి కావడంతో నదిలో ప్రవాహం అడుగంటింది. దీంతో ఏకంగా నదిలో రోడ్డువేసి పెద్దపెద్ద టిప్పర్లను తరలిస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని రైతులకు ప్రలోభ పెట్టి వారి పొలాల్లో దర్జాగా రోడ్లు వేశారు. రాత్రింబవళ్లు టిప్పర్లు తిరుగుతుండటంతో సమీప గ్రామాల్లో దుమ్ము ధూళి పడుతున్నది. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారు.
ముడుమాలకు చెందిన ఇద్దరు యువకులు రాత్రి పూట గ్రామానికి వెళ్తుండగా ఇసుక టిప్పర్లు వేగంగా రావడంతో ప్రమాదం నుంచి వారు త్రుటిలో తప్పించుకున్నారు. వెంటనే ఆ టిప్పర్లను ఆపి డ్రైవర్లను నిలదీస్తుంటే అక్కడికి చేరుకున్న ఇసుక మాఫియా సదరు ఇద్దరు యువకులపై దాడికి దిగింది. వారి ఫోన్లను లాక్కొని పగులగొట్టి బెదిరించి పంపించారు. ఈ విషయాన్ని గ్రామస్థుల దృష్టికి తీసుకెళ్లి కృష్ణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి వారం రోజులు గడుస్తున్నా పోలీసులు ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహించిన గ్రామస్థులు ఆదివారం ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారు. నదిలో ఇసుకను నింపిన టిప్పర్లను ఖాళీ చేయించి తిప్పి పంపించారు.
ఇంత జరుగుతున్నా పోలీస్, రెవెన్యూ యంత్రాంగం మాత్రం కన్నెత్తి చూడటంలేదు. ఇసుక దందాకు మక్తల్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నందున అధికారులు పట్టించుకోవడంలేదని తెలుస్తున్నది. ఏకంగా కృష్ణానదిలో టిప్పర్లు పెట్టి కోట్ల రూపాయల విలువైన ఇసుకను తరలిస్తున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న ఫిర్యాదులున్నాయి. ఈ విషయమై సీఐ రామ్‌లాల్‌ను వివరణ కోరగా.. కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముడుమాల గ్రామం వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టు సమాచారం ఉన్నదన్నారు. కొన్ని కేసులు కూడా నమోదు చేశామని తెలిపారు. ముడుమాల యువకులను కొట్టినట్టు తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.