Hadli Vagu | హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): హల్దీవాగులో జరుగుతున్న అక్రమ దందా గుట్టును రట్టు చేస్తూ రెండు రోజులుగా ‘నమస్తే తెలంగాణ’లో ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముఠా అక్రమంగా వాగులోకి చొరబడి, దర్జాగా ఇసుకను ఎత్తుకుపోతున్న తీరును ప్రత్యక్ష పరిశీలనాత్మక కథనాలతో బయటపెట్టింది. రైతుల పంట పొలాలను ఎండబెట్టి, వాగులోకి తొవ్వ పెట్టిన తోడేళ్ల ఆనవాళ్లను పట్టుకొని జనం ముందు నిలబెట్టింది.
నిజంగా మెదక్ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం క్రియాశీలంగా ఉండి ఉంటే మాఫియా ముఠాను పట్టుకొని బోనులో నిలబెట్టేది. అక్రమ దందాను అడ్డుకొనేది. ఇప్పటివరకు అవేం జరుగలేదు. ఒక వైపు పత్రికా కథనాలు ఇసుక దందాపై యుద్ధం చేస్తుంటే.. మరో వైపు జంకూబొంకు లేకుండా యథేచ్ఛగా వ్యాపారం సాగుతూనే ఉన్నది. ఆదివారం రాత్రి కూడా నిర్విరామంగా కంటెయినర్లలో ఇసుక తరలించినట్టు స్థానికులు చెప్తున్నారు.
ఏండ్లకేండ్లుగా ఇసుక వ్యాపారంపైనే ఆర్థికంగా స్థితుమంతుడైన కాంగ్రెస్ ముఠా నాయకుడు తాజాగా హల్దీవాగు మీద దృష్టి పెట్టినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ మూడేండ్ల కాలంలో హల్దీవాగు ఇసుకపై రూ.1,000 కోట్ల అక్రమ వ్యాపారానికి స్కెచ్ వేసినట్టు ఆయన అనుచరుల ద్వారా తెలిసింది. ఇప్పటికే మెదక్ జిల్లా మాసాయి పేట నుంచి పాపన్నపేట మండలం ఏడుపాయల వరకు దాదాపు 65 కిలోమీటర్ల మేర 20 ఇసుక క్వారీ స్పాట్లను గుర్తించినట్టు చెప్తున్నారు.
కొల్చారం మండలం కొంగోడు, మెదక్ మండలం ర్యాలమడుగు, వెల్దుర్తి మండలం దరిపల్లి, పెద్దబాయి తండా, సంగాయిగూడ తండా, చిట్యాల, జానకంపల్లి గ్రామ పొలిమేర, మక్తభూపతిపురంతోపాటు మరికొన్ని ప్రాంతాలు సురక్షిత రవాణాకు, సులువుగా వాగులోకి దిగి ఇసుక తోడటానికి అనువైన ప్రాంతాలుగా గుర్తించినట్టు చెప్తున్నారు. వీటిలో సంగాయిగూడ, మక్తభూపతిపురం క్వారీల నుంచి ఇసుక తీస్తున్నారు. రోజుకు 5 వేల టన్నుల ఇసుక తోడి వ్యాపారం చేసుకుంటున్నారు. దీంతో ‘అవినీతిపై ఉక్కుపాదం’ అంటూ అధికారులు చేసిన ప్రతిజ్ఞ నవ్వులపాలైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నెల 19న హల్దీవాగు నుంచి ఇసుకతో వెళ్తున్న టెన్ టైర్ టిప్పర్లు ‘నమస్తే తెలంగాణ’ కెమెరాలకు చిక్కాయి. పారే నీళ్లను పట్టపగలే ఒక పక్కకు మలిపి, వాగు నడి మధ్యలో కిలోమీటర్ మేర ప్రైవేటు రోడ్డు వేశారు. అధునాతన యంత్రాలతో ఇసుకను తోడి హైదరాబాద్‌కు, కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు తరలిస్తున్నారు. రోజుకు 5 వేల టన్నుల చొప్పున 100 కంటెయినర్ల ఇసుకను తోడేస్తున్నారు. జిల్లా కేంద్రం మెదక్ పట్టణం నడిబొడ్డు నుంచే సాయంత్రం 6 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నిర్విరామంగా లారీలు పరుగులు తీస్తున్నాయి. ఇంత జరుగుతున్నా.. ఒక్క రెవెన్యూ అధికారి అడ్డుకోవడం లేదు.

‘పారదర్శక పాలనే మా లక్ష్యం. వృత్తిపై నిబద్ధతతో, నీతి నియమాలు అనుసరిస్తాం. అధికారులందరం కలిసి అవినీతిపై ఉకుపాదం మోపుతాం. అవినీతిని కూకటివేళ్లతో పెకిలించడమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేస్తాం. మేము అవినీతికి పాల్పడం. మెదక్ జిల్లాను రాష్ట్రంలోనే అవినీతి రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాము’
– ఇది నవంబర్ 6న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ప్రభుత్వ అధికారులతో చేయించిన ప్రతిజ్ఞ

‘సార్.. హల్దీవాగులోకి ఇసుక మాఫియా చొరబడ్డారు. వందల లారీల ఇసుకను వాగు దాటిస్తున్నారు. రాత్రివేళ కలెక్టరేట్ ముందు నుంచి, ఎస్పీ కార్యాలయం దాటి లారీలు వెళ్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల పేరున ఇసుక దందా చేస్తున్నారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపండి. ప్రకృతి వనరులను కాపాడండి’
– ఇది నవంబర్ 21న మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు ఇచ్చిన వినతిపత్రం