మహబూబ్‌నగర్ : కర్ణాటకలోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ( Rajoli Banda Diversion Scheme) ను బీఆర్ఎస్ నాయకులు బుధవారం పరశీలించారు. మాజీ మంత్రులు డా. సి.లక్ష్మారెడ్డి ( Lakshmareddy ) ,శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) , ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, నరేందర్ రెడ్డి, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర నాయకులు రాజోలి బండను సందర్శించిన వారిలో ఉన్నారు.
ఆర్డీఎస్ వద్ద కర్ణాటక, ఏపీ రాష్ట్రాలు తుంగభద్ర జలాల దోపిడీకి చేపట్టిన అక్రమ ప్రాజెక్టులు (Illegal projects ) వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర నీటి వాటా కోల్పోతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైట్ కెనాల్ కట్టడానికి ప్రయత్నం చేసిందని ఆరోపించారు. గతంలో ఆర్డీఎస్ రైతుల కష్టాలు కేసీఆర్ పాదయాత్ర ద్వారా తెలుసుకున్నారని, వారికి ఇచ్చిన మాట ప్రకారం తుమిళ్ల లిఫ్ట్ పూర్తి చేశారని పేర్కొన్నారు.
తుంగభద్ర జలాల దోపిడీతో ఆర్డీఎస్ ఆయకట్టు ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లాకే మొదటగా అన్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు. కొడంగల్‌కు ఎన్వోసి కోసం ఏపీ, కర్ణాటక మిగతా ప్రాజెక్టులకు రేవంత్ ఎన్వోసీ ఇచ్చినట్లు సమాచారం తమకు ఉందని వెల్లడించారు. కొడంగల్ లిఫ్ట్ అనేది అనవసరమైన ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. పనికి రాని ప్రాజెక్ట్ కోసం తెలంగాణ హక్కులను కోల్పోతున్నామని తెలిపారు.
శ్రీశైలం వరకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం కండ్లు మూసుకొని కూర్చుందని,మంత్రుల బృందం ఒకసారి వచ్చి చూడాలని, మహబూబ్ నగర్ హక్కులు కాపాడాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో తెలంగాణ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామని వివరించారు.