హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ)/ ఆర్కేపురం: ఎక్కడో మారుమూల భవనాల్లో ఒక దవాఖానను సెట్ చేసి, అక్కడికి అమాయకులను ఎత్తుకొచ్చి వారి అవయవాలను దోపిడీ చేసే ముఠాలు సాధారణంగా సినిమాల్లో కనిపిస్తుంటాయి. కానీ హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిఘా వ్యవస్థ కండ్లుగప్పి ఒక దవాఖానలో అక్రమంగా కిడ్నీ మార్పిడులు జరుగుతున్న ఉదంతం బట్టబయలైంది. ఈ దందా వివరాలను రంగారెడ్డి డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్‌కుమార్ మంగళవారం వెల్లడించారు. సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో డాక్టర్ సుమంత్ అలకనంద పేరుతో ఓ దవాఖానను ఏర్పాటు చేశాడు. ఇక్కడ అక్రమంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు. కిడ్నీ అవసరమైన వారిని, కిడ్నీ ఇచ్చే వారిని ఒకేసారి పిలిపించి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలకు చెందిన వారు ఎక్కువగా ఇక్కడికి వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై మంగళవారం మధ్యాహ్నం డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లుకు సమాచారం వచ్చింది. డీసీపీ ప్రవీణ్‌కుమార్, ఏసీపీ కృష్ణయ్యతో కలిసి అందరు ఆ దవాఖానపై దాడి చేశారు. అక్కడున్న కిడ్నీ బాధితులను గాంధీ దవాఖానకు తరలించారు. డాక్టర్ సుమంత్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, దవాఖానను సీజ్ చేశామని పోలీసుల తెలిపారు.
ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.55 లక్షలు వసూలు చేస్తున్నట్టు బయటపడింది. కిడ్నీ డోనర్స్, రిసీవర్స్‌కు ప్రదీప్ అనే వ్యక్తి మధ్యవర్తిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే పదుల సంఖ్యలో మార్పిడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయంపై మీడియేటర్లు, వైద్యులు, డోనర్స్‌కు మధ్య పంపకాల విషయంలో తేడాలు రావడంతోనే డీఎంహెచ్‌వోకు ఫోన్లో సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.
చట్టవిరుద్ధంగా జరుగుతున్న కిడ్నీ మార్పిడుల వ్యవహారంపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీశారు. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. ఈ కేసులో భాగస్వాములైన డాక్టర్లు, హాస్పిటల్ యాజమాన్యం, ఇతర వ్యక్తులను ఉపేక్షించొద్దని, చట్ట ప్రకారం కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. నిఘా పెట్టాలని పోలీస్ ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు.