హైదరాబాద్/సుల్తాన్‌బజార్ ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో అలవిగాని హామీలు ఇచ్చి.. ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం మరిచిపోయిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ఎన్నికలకు ముందు గౌడన్నలకు వైన్‌షాపుల్లో 25 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి.. మ్యానిఫెస్టోలో పెట్టి, తీరా నోటిఫికేషన్ నాటికి ఆ హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ.. శుక్రవారం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద గౌడ సంఘాల నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో శ్రీనివాస్‌గౌడ్ సాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇష్టారాజ్యంగా హామీలు ఇచ్చి.. దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, కులవృత్తులవారికి ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. హైద్రాబాద్‌లో కల్లు దుకాణాల మూసివేత వెనుక కాంగ్రెస్ సర్కార్ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. మద్యం మాఫియాకు తలొగ్గి.. కల్లుగీత కార్మికుల పొట్ట కొడుతున్నారని విమర్శించారు.
గొల్లకుర్మలకు ఇస్తామని చెప్పిన రూ.3 లక్షలు ఎక్కడ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. కుల వృత్తులను గాలికి వేదిలేసిందని మండిపడ్డారు. తెలంగాణలో రెండేండ్లలో తాటి, ఈత చెట్లపై నుంచి ప్రమాదానికి గురై 1,145 మంది గీత కార్మికులు చనిపోయారని, తక్షణమే వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైద్రాబాద్‌లో మూసివేసిన కల్లు దుకాణాలను వెంటనే తెరిపించాలని అన్నారు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని చెప్పారు. వైన్‌షాపులలో గౌడ్లకు కాంగ్రెస్ పార్టీ 25% ఇస్తామని ఇచ్చిన హామీని నిబెట్టుకోవాలన్నారు. గౌడ్లపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజుగౌడ్, గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐలి వెంకన్నగౌడ్, గౌడ ఐక్యసాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్, బీసీ సమైఖ్యత అధ్యక్షుడు ఎస్ దుర్గయ్య గౌడ్, జీబీఎన్ చీకటి ప్రభాకర్ గౌడ్, దామోదర్ గౌడ్, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.