ముప్కాల్, మే 29: అటు రాష్ట్రంలో ఇటు బాల్కొండ నియోజకవర్గంలో అరాచక, నియంత పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జోగు నర్సయ్య ఇటీవల కాంగ్రెస్ ఇచ్చిన హామీలతోపాటు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్‌రెడ్డి అక్రమాలపై సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నించారు. దీంతో నర్సయ్యకు పోలీసులు నోటీసులు జారీచేశారు. దీనిని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు గురువారం ముప్కాల్ పోలీసుస్టేషన్ ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలని ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని మండిపడ్డారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్‌రెడ్డి చేస్తున్న అక్రమాలను ఎత్తి చూపుతున్న జోగు నర్సయ్యపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రశ్నించినవారిపై అకారణంగా కేసులు పెడుతూ పోలీసుస్టేషన్‌కు ఎందుకు పిలిపిస్తున్నారని ఎస్సైని అడిగితే.. కేసు పెట్టిన వాళ్లను అడిగి చెబుతామని సమాధానం ఇస్తున్నారని పేర్కొన్నారు. గతంలో సునీల్‌రెడ్డి.. మాజీ మంత్రి వేములతోపాటు ఆయన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేసినా తాము ఇలా వ్యవహరించలేదని గుర్తుచేశారు. బాల్కొండ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాచేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రూ.వందల కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు.