హైదరాబాద్, ఆక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తవ్యస్థంగా తయారైందని, ప్రభుత్వ పెద్దల చీకటి దందాలతో కుక్కలు చింపినవిస్తరిలా మారిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుచరులు ఏరియాలను పంచుకొని అక్రమ దందాలు, భూ మాఫియాలో మునిగితేలుతుంటే, ఆయన క్యాబినెట్‌లోని మంత్రులు మాఫియా డాన్లలా మారి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో శాంతిభద్రతలతో నిశ్చింతగా, అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సుభిక్షంగా ఉన్న తెలంగాణకు ఈ దుస్థితి వస్తుందని ఏ పౌరుడూ అనుకోలేదని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో మొన్న రాత్రి నుంచి హైడ్రామా నడుస్తున్నదని, మంత్రి ఇంట్లో ఉన్న ఓ నిందితుడిని అదుపులోకి తీసుకోవడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో సామాన్యుడికి ఓ న్యాయం.. మంత్రి అనుచరులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ, అరాచక, దుర్మార్గపు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని రాష్ట్ర గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు త్వరలోనే గవర్నర్‌ను కలిసి కాంగ్రెస్ దుర్మార్గాలను వివరించి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరతామని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులు పాలన చేతగాదని తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. పోలీసులు సైతం ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. ‘ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన క్రిశాంక్‌పై కేసులు నమోదుచేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నల్లబాలు, గౌతమ్‌ను జైళ్లో పెట్టి వేధించారు. యూరియా అడిగిన పాపానికి మిర్యాలగూడ గిరిజన రైతును అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారు’ అని ఆరోపించారు. కానీ ఓఎస్డీల ముసుగులో తప్పుడు ప నులకు పాల్పడుతున్న సీఎం, మంత్రుల అనుచరులను చూసీచూడనట్టు వదిలిపెడుతున్నారని దుయ్యబట్టారు. ఖమ్మం ఏసీపీ మంత్రి పొంగులేటి అక్రమాలకు వత్తాసు పలుకుతూ చట్టాలకు పాతరేస్తున్నారని విమర్శించారు.
‘దక్కన్ సిమెంట్ యాజమానులను బెదిరించిన సీఎం సన్నిహితుడు రోహిన్‌రెడ్డి, మంత్రి సురేఖ ఓఎస్డీ సుమంత్‌పై కేసులెందుకు పెట్టలేదు? పొంగులేటి బెదిరింపులతో ఆత్మహత్యాయత్నం చేశానని బాధితుడు బానోత్ రవి ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు?’అని ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. మొన్న రాత్రి కొండా సురేఖ ఇంటికి వెళ్లిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రేక్షకులుగా మారిపోవడం దారుణమని ధ్వజమెత్తారు. సచివాలయంలో జరగాల్సిన వ్యవహారాలు ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌ల్లో జరగడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. ‘సీఎం అనుచరులు ఫహీం, రోహిణ్‌రెడ్డి, ఆయన అన్నదమ్ములు ఏరియాలు పంచుకొని ఆర్ ఆర్ ట్యాక్స్ పేరిట ప్రజలను పీల్చుకుతింటున్నారని ఆరోపించారు. అసలు రోహిణ్‌రెడ్డి, సు మంత్ గన్స్ చూపి ఎలా బెదిరిస్తారు? వారి చేతుల్లోకి తుపాకులుఎలా వచ్చాయని ప్రశ్నించారు. ? మంత్రి సురేఖ కూతురు మాటలతోనే ప్రభుత్వ పెద్దల చీకటి బాగోతాలు బట్టబయలయ్యాయని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాల్‌డాటాను బయటపెడితే వాస్తవాలు తెలుస్తాయన్నారు.
బీసీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు సీఎం రేవంత్‌రెడ్డికి చెంపపెట్టులాంటిందని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజ్యాదవ్ పేర్కొన్నారు. బీసీలను మభ్యపెట్టేందుకు డ్రామాలాడుతున్న సీఎం ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగ సవరణ ద్వారా చేయాల్సిన ప్రక్రియను పక్కనబెట్టి జీవో ఇచ్చి చేతులు దులుపుకొసమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్, రామచంద్రునాయక్, నేతలు కల్వకుర్తి శ్రీనివాస్‌యాదవ్, బద్రుద్దీన్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ హామీలను నమ్మి ఓటేసిన పాపానికి ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నదని ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం, మంత్రులు పాలనను పక్కనబెట్టి దందాలు, చందాల వసూళ్లలో మునిగితేలుతున్నారని తూర్పారబట్టారు. ‘పనుల్లో కమీషన్లు, వాటాల కోసం బాహాటంగా కొట్టుకుంటున్నారు. మంత్రులు అడ్లూరిపై పొన్నం, వివేక్‌పై అడ్లూరి, పొంగులేటిపై సీతక్క, కొండా సురేఖ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తెలంగాణ పరువుతీస్తున్నారని మండిపడ్డారు. వారి తీరు చూస్తుంటే మాఫియా డాన్ల చేతుల్లోకి రాష్ట్రం వెళ్లిందా? అనే అనుమానం కలుగుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణభవన్ ముందు ఇంటెలిజెన్స్ పెట్టే బదులు రోహిణ్‌రెడ్డి, ఫహీంఖురేషీ, తిరుపతిరెడ్డి గెస్ట్‌హౌస్‌ల ముందు నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒక్క భూ యాజమాని కూడా సుఖంగా లేడని పేర్కొన్నారు.
పాలన నడిపి ప్రజల బాగోగులు చూడాల్సిన మంత్రులు మాఫియా డాన్లలా తయారయ్యారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. శాఖలు పంచుకొని ప్రజలను దోచుకు తింటున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో గన్‌కల్చర్, మాఫియా డాన్లు పోవాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలని ఓటర్లకు పిలుపు నిచ్చారు. పొరపాటు చేస్తే కాంగ్రెస్ నేతల అరాచకాలకు లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుందని, బీఆర్ఎస్ గెలవకుంటే మాఫీయా మరింత పెట్రేగిపోతుందని హెచ్చరించారు.