IIT Hyderabad: 21 ఏళ్ల వయసులోనే హైదరాబాదీ కుర్రాడు అరుదైన విజయం సాధించాడు. రూ.2.5 కోట్ల ప్రారంభ వేతనంతో జాబ్ ఆఫర్ అందుకున్నాడు. ఐఐటీ హైదారాబాద్ లో బీటెక్ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ అనే 21 ఏళ్ల యువకుడు ఈ ఘనత సాధించాడు. ఇంకా ఇంజనీరింగ్ పూర్తి కాకుండానే అతడు ఈ ఘనత సాధించాడు. ఐఐటీహెచ్ కు సంబంధించి గతంలో ఉన్న అత్యధిక ప్యాకేజీ రికార్డు (రూ.1కోటి)ను ఎడ్వర్డ్ బ్రేక్ చేశాడు.
చివరగా 2017లో ఐఐటీహెచ్ లో ఒక విద్యార్థికి అత్యధికంగా కోటి వేతనం అందింది. సాధారణంగా ఇక్కడి యంగ్ ఐఐటీయన్లకు రూ.60 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు వేతనాలు అందుతుంటాయి. అలాంటిది ఎడ్వర్డ్ దీనికి భిన్నంగా, మూడు, నాలుగు రెట్లు అత్యధిక ప్యాకేజీ అందుకోబోతున్నాడు. ఎడ్వర్డ్ కు నెదర్లాండ్స్ కు చెందిన ఆప్టివర్ అనే గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ ఈ ఆఫర్ అందించింది. దీని ప్రకారం అతడు వచ్చే జులైలో కంపెనీలో చేరాల్సి ఉంటుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఎడ్వర్డ్ కు ఈ ప్యాకేజీ క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చింది కాదు. కొంతకాలం క్రితం ఆప్టివర్ సంస్థలో రెండు నెలల సమ్మర్ ఇంటర్న్ షిప్ చేయగా.. దీనిలో అతడి టాలెంట్ కు మెచ్చి ఇచ్చిన ఆఫర్ ఇది.
ఇక ఎడ్వర్డ్ హైదరాబాద్లోనే పుట్టి పెరిగాడు. 7వ తరగతి నుంచి 12 వరకు మాత్రం బెంగళూరులో చదువుకున్నాడు. ఐఐటీలకు కంపెనీలు ఎక్కువగా వస్తుంటాయని, అయితే, అవకాశాలు, వేతనాలు కాస్త తక్కువే ఉంటాయనే కారణంతో తాను ముందునుంచి ప్రిపేర్ అవ్వడం వల్లే ఈ విజయం దక్కిందని ఎడ్వర్డ్ చెప్పాడు. గతంలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కు సంబంధించి జరిగిన ఓ పోటీలో తాను ఇండియాలోనే టాప్ 100లో ఉన్నానని ఎడ్వర్డ్ చెప్పాడు. ఐఐటీ హైదరాబాద్ కు చెందిన మరో విద్యార్థికి రూ.1.1 కోట్ల ప్యాకేజీ ఆఫర్ వచ్చినట్లు సంస్థ వెల్లడించింది.