హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణపై పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందంతో సమగ్ర అధ్యయనం జరిపించి నెల రోజుల్లోగా నివేదిక అందజేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. భద్రాచలం ముంపుపై కూడా అధ్యయనం చేయించాలని సూచించారు. శనివారం ఆయన రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. పోలవరం నుంచి బనకచర్ల లింక్ ప్రాజెక్టును త్వరలో చేపడతామని ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఆ అంశంపై ఈ భేటీలో సమీక్షించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు కొత్తగా చేపట్టనున్న లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు వాటిల్లే నష్టాన్ని అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పోలవరం వల్ల ఏర్పడే ముంపు, భద్రాచలం ఆలయంపై పడే ప్ర భావాన్ని అధ్యయనం జరిపించాలని ఆదేశించారు. ఐఐటీహెచ్ బృందంతో కో-ఆర్డినేషన్ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూ చించారు. వరద జలాల ఆధారంగా ఏపీ సర్కారు కొత్తగా చేపట్టిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని, దీనిపై తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను తెలియజేస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, జీఆర్ఎంబీకి, కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖలు రాయాలని అధికారులకు స్పష్టం చేశారు.