హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ): కెమికల్ రంగంలో వినూత్న ఆవిష్కరణల కోసం జరిగే పరిశోధనల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని పలువురు శాస్త్రవేత్తలు తెలిపారు. బయోఏషియా సదస్సులో ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేసి, ఐఐసీటీ ఆవిష్కరణలపై అవగాహన కల్పించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో మానవాళిని రక్షించే కీలకమైన వ్యాక్సిన్ తయారీలో ఫార్మా కంపెనీలకు అవసరమైన ఎన్నో పరిశోధనలను సునాయాసంగా చేసి మెరుగైన ఉత్పత్తుల తయారీకి సహకరించినట్టు ఐఐసీటీ శాస్త్రవేత్త దేవాశిష్ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అడ్వాన్స్ టెక్నాలజీని ఐఐసీటీ కలిగి ఉన్నదని వివరించారు.