హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): వర్తమాన అవసరాలకు తగ్గట్టు విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా సంస్కరణల పథంలో అడుగులు వేస్తున్న ఇగ్నో వర్సిటీ కొత్తగా డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టింది. విదేశీ విద్యనభ్యసించడం, పరిశోధనలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ ఏడాది తొలిసారిగా నాలుగేండ్ల డిగ్రీ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది.
దూరవిద్యతోపాటు ఆన్లైన్లో పలు కోర్సులను ఆఫర్ చేస్తున్నది. 2024 జనవరి సెషన్ అడ్మిషన్ల నోటిఫికేషన్నూ విడుదల చేసింది. బీఏ, బీకాం, బీఎస్సీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్టు ఇగ్నో ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ రమేశ్, అసిస్టెంట్ డైరెక్టర్ బోళ్ల రాజు తెలిపారు. ఔత్సాహికులు జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రవేశ వివరాల కోసం www.ignou.ac.in వెబ్సైట్ను సందర్శించాలని, 9492451812ను సంప్రదించాలని సూచించారు.