ఊర్కొండ, ఏప్రిల్ 1 : మహిళపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలో మహిళపై సామూహిక లైంగికదాడి జరిగిన ప్రదేశాన్ని ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన నిందితులు ఏడుగురు పోలీసుల అదుపులో ఉన్నట్టు పేర్కొన్నారు. నిందితులకు క్రిమినల్ లా, పోక్సో వంటి చట్టాలపై అవగాహన ఉండటంతో మైనర్ల జోలికి వెళ్లకుండా, కేవలం ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం, భయపెట్టి డబ్బుల వసూలు, నగలు గుంజుకోవడం వంటి పనులు చేశారని ఐజీ చెప్పారు. తెలివిగా ఆలోచిస్తూ వివాహితులను టార్గెట్ చేశారని తమ దర్యాప్తులో తేలిందని అన్నారు. ఆలయ ఉద్యోగితోపాటు ఆరుగురి ఫోన్ కాల్స్ లిస్టు పరిశీలిస్తున్నామని, మరో మూడు రోజుల్లో పూర్తి సమాచారం వెల్లడిస్తామని చెప్పారు. లైంగిక దాడి విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు. ఆలయానికి వచ్చే వారికి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.