హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు పార్టీలో ఉన్న తెలంగాణవాసులంతా లొంగిపోవాలని మల్టీజోన్ ఐజీ-1 చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. తెలంగాణలో మావోయిస్టుల కదలికలేమీ లేవని, కర్రెగుట్టలో తెలంగాణ పోలీసులు ఎలాంటి కార్యకలాపాలను నిర్వహించట్లేదని సోమవారం మీడియాకు స్పష్టం చేశారు. కేంద్ర బలగాలు వెంకటాపురం ఏరియాలో బేస్‌క్యాంప్‌ను ఏర్పాటు చేసుకొని కూంబింగ్ చేస్తున్నాయని, తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. మావోయిస్టులు తెలంగాణలో ప్రవేశించకుండా గస్తీ కాస్తున్నట్టు తెలిపారు.
కర్రెగుట్ట అడవుల్లో 100కు పైగా ఐఈడీలు
ములుగు, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల కర్రెగుట్టను ఆపరేషన్ కగార్‌లో భాగంగా స్వాధీనం చేసుకునేందుకు భద్రతా బలగాలు ప్రయత్నం చేస్తున్నాయి. సోమవారం గాలింపు చర్యల్లో భాగంగా భద్రతా బలగాలకు బీరు బాంబులు, 100కు పైగా ఐఈడీలు లభ్యంకాగా వాటిని నిర్వీర్యం చేస్తూ లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నట్టు తెలిసింది. 250 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కర్రెగుట్టల్లో అనేక కొండలు, సొరంగాలు పోలీస్ బలగాలకు సవాల్‌గా మారుతున్నాయి. భద్రతా దళాలు హెలికాప్టర్లు, డ్రోన్ల సహాయంతో నిఘా పెట్టినప్పటికీ మావోయిస్టులు డెన్లను కనుగొనడం సవాల్‌గా మారింది.