నల్లగొండ, మే 20: గొర్రెల యూనిట్లు రాకపోవడంతో తమకు గొర్రెలు ఇవ్వకున్నా ఫర్వాలేదు కానీ, తాము కట్టిన డీడీ డబ్బులైనా ఇవ్వాలని గొల్లకుర్మలు కోరుతున్నారు. సోమవారం నల్లగొండ కలెక్టర్ హరిచందనను లబ్ధిదారులు వేడుకున్నారు. తాము అప్పులు తెచ్చి డీడీలు కట్టామని, ఏడు నెలలుగా ఆ సొమ్ముకు వడ్డీ పెరిగిపోతున్నదని వాపోయారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం రాజన్నగూడెం గ్రామానికి చెందిన 61 మంది గొల్లకుర్మలు రెండో విడత గొర్రెల యూనిట్లకు రూ.43,750 చొప్పున కలెక్టర్ పేరు మీద డీడీలు చెల్లించారు. గతేడాది గొర్రెల యూనిట్లు ఇచ్చే సమయంలో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ రావడంతో ఆ పథకం అమలు నిలిచిపోయింది. కాగా డిసెంబరు 3న ఎన్నికల కోడ్ ముగిసింది. అయితే సబ్సిడీ గొర్రెలు ఇచ్చేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తమకు డీడీ డబ్బులు అయినా ఇవ్వాలని ఐదు నెలలుగా లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో డీడీ డబ్బులు తిరిగి ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు.