మల్లాపూర్, అక్టోబర్ 7: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇప్పుడే గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏకంగా రానున్న ఎన్నికల్లో స్వంతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తికి సంబంధించిన బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో పాటు, ఓ ప్లాస్టిక్ కాగితంపై ఇప్పుడు బండి.. తర్వాత నువ్వే.. నువ్వు నిలబడురా అంటూ బెదిరింపు పదాలను రాసిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చి మండల వ్యాప్తంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే గుండంపల్లి గ్రామంలో ఈ ఎన్నికల్లో సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్ రిజర్వేషన్‌గా అధికారులు ఖరారు చేశారు. దీంతో గ్రామంలోని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో గత కొన్నేండ్లుగా కారోబార్‌గా పనిచేస్తున్న అండెం రాజేష్ ఈ ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్ వచ్చిందని, సర్పంచ్‌గా తాను స్వతంత్ర్య ఆభ్యర్థిగా పోటీ చేస్తానని బంధువులు, గ్రామస్థులకు ప్రచారం చేసుకున్నాడు. గత మూడు రోజుల క్రితం గ్రామశివారులోని తన వ్యవసాయ తోట వద్ద పని నిమిత్తం ద్విచక్రవాహనంపై వెళ్లి రోడ్డు పక్కనే దాన్ని నిలిపి ఉంచాడు. సదరు బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కొద్ది దూరం తీసుకెళ్లి బండరాళ్లతో కొట్టి ధ్వంసం చేయడంతో పాటు, అక్కడే పక్కన ఉన్న ప్లాస్టిక్ కాగితంపై ఇప్పుడు బండి తర్వాత నువ్వే నువ్వు నిలబడురా అంటూ పదాలను రాసి అక్కడే పడేసినట్లు తెలిపారు. కొద్ది సమయం తర్వాత ద్విచక్రవాహనం కోసం రాజేష్ గాలించగా, కొద్ది దూరంలో బండిని పడేసి ఈ కాగితంను రాసి ఉంచారని బాధితుడు తెలిపాడు.