ఆదిలాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : పోడు రైతుల జోలికొస్తే ఊరుకునేది లేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం, బాబ్జీపేటకు చెందిన వారు కొన్నేండ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్నారు. 50 వేల హెక్టార్ల పోడు భూముల్లో మొక్కలు నాటడానికి అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం వాహనాల్లో అటవీశాఖ అధికారులు, పోలీసులతో కలిసి బాబీపేట్ గ్రామానికి చేరుకున్నారు. రెండు గ్రామాల రైతులు అటవీశాఖ అధికారులను అడ్డుకోగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అక్కడికి చేరుకుని గ్రామస్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు.
ఈ సందర్భంగా అధికారులను నిలదీశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము మొక్కలు నాటుతున్నట్టు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. ఎన్నో ఏండ్లుగా అటవీ భూములను సాగు చేస్తూ స్థానికులు ఉపాధి పొందుతున్నారని, పోడు వ్యవసాయాన్ని అడ్డుకుంటే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ అధికారులను హెచ్చరించారు. పోడు రైతుల పట్ల మానవతా ధృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. అటవీశాఖ అధికారులు రైతులను బెదిరించడం సరికాదన్నారు.
అధికారుల చర్యల ఫలితంగా వేలాది మంది ఉపాధి కోల్పోతున్నట్టు చెప్పారు. ప్రభుత్వం పోడు రైతుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని మండిపడ్డారు. ఏండ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్న రైతుల ఉపాధిని కొల్లగొట్టే ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. అటవీ అధికారులు గ్రామం నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోడు రైతులందరికీ పట్టాలు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.