Minister Mallareddy | ఏందన్నా ఫుల్ జోష్లో ఉన్నట్టున్నరు?
మనం ఎప్పుడైనా జోష్లనే ఉంటం. జనాలకు జోష్ ఇస్తం. మల్లన్న అంటెనే జోష్.. జోష్ అంటెనే మల్లన్న.
ప్రచారంలో దూసుకుపోతున్నరు. స్పందన ఎలా ఉంది?
ఇయ్యాల ఓట్ల కోసమని కాదు. ప్రచారం కోసమని కాదు. ఎప్పుడైనా జనాల కోసమే తిరుగుతుంట. వాళ్లే గెలిపించి ఎమ్మెల్యేను చేశిర్రు. మంత్రిని అయిన. వాళ్లతోటే ఉన్న కాబట్టి మళ్లీ నన్నే కోరుకుంటున్నరు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాలపై కామెంట్ ?
ఆ పథకాలను జనాలు నమ్మే స్థితిలో లేరు. మా అధినేత కేసీఆర్ మ్యానిఫెస్టో ప్రకటించిన తర్వాత జనాలు కాంగ్రెస్ ఆరు పథకాలను ఎప్పుడో మరిచిపోయారు. గతంల 2014, 2018ల మ్యానిఫెస్టో ప్రకటించినం. చెప్పింది చేశినం. చెప్పనివి కూడా ఎన్నో సక్సెస్ఫుల్గా అమలు చేశినం. ఇప్పుడు కూడా మా మ్యానిఫెస్టో వందకు వంద శాతం అమలైతది. బీఆర్ఎస్ దగ్గర ఆ దమ్ముంది.
ఈసారి మీ ప్రత్యర్థి ఎవరు? పోటీ ఎలా ఉండబోతోంది?
ఒకమాట చెప్పాల్నా..? అసలు నాకు పోటీ అనేదే ఉండది. పోయిన ఎన్నికల్ల మీరు చూశిర్రు కదా.. 87వేల ఓట్ల మెజారిటీతోటి గెలిచిన. ఈసారి లక్ష దాటుతది. మీరే సూస్తరు. ఇది పకా. ఇగ ప్రత్యర్థి అంటే.. ఏ పార్టీ నుంచి ఎవరొచ్చినా మల్లన్నదే గెలుపు.
మేడ్చల్ ఎంపీగా రేవంత్ రెడ్డి ఉన్నారు? మీ ఓటర్ల మీద ఆయన ప్రభావం ఏమైనా ఉంటదా?
పైసలిచ్చి పీసీసీ పదవి కొనుకున్నడు. పైసలు తీసుకోని ఎమ్మెల్యే సీట్లు అమ్ముకుంటున్నడు. ఐదేండ్లల్ల ఒకనాడు కూడా ఒక రూపాయి నియోజకవర్గం కోసం ఖర్చు పెట్టలే. గాయినె మాటలు నమ్ముతారే మా మేడ్చల్ ప్రజలు. ప్రభావం ముచ్చట పకన పెడితె.. ఇటెంకల్ల వస్తే ఉరికిచ్చి కొడుతరు.
మీకు సోషల్ మీడియాలో, జనాల్లో అంత ఫాలోయింగ్ ఎలా వచ్చింది?
మొఖం మీద మాట్లాడటం వల్ల జనాలు నన్ను బాగా ఇష్టపడుతరు. కడుపుల ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోలా మాట్లాడేది నాకు రాదు. నేను బోలా.. ఏది అనిపిస్తే అదే మాట్లాడుతా. షాని షానిగ మాట్లాడటం రాదు. అందుకే జనాలకు నచ్చుతనేమో.