హుస్నాబాద్, గజ్వేల్, జనవరి 22: ఉద్యోగులపై ప్రేమ ఉంటే వారి ఆదాయపన్నును మినహాయించాలని బీజేపీని ఆర్థికమంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌తో మాట్లాడి ఉద్యోగులకు రూ.6 లక్షల వరకు ఐటీ మినహాయించేలా ఒప్పించే సత్తా రాష్ట్ర బీజేపీ నేతలకు ఉన్నదా? అని ప్రశ్నించారు. శనివారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం, గజ్వేల్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. 25 మందికి డబుల్ బెడ్రూం ఇండ్ల మంజూరు పత్రాలను అందిం చారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు పోచంపల్లి యూనిఫాంలను పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ.. స్థానికులకు 95% ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే రాష్ట్ర ప్రభు త్వం జీవో 317ను జారీ చేసిందని, దీని ప్ర యోజనాలు తెలియకుండా బండి సంజయ్ కపట ప్రేమను నటిస్తూ దీక్షలు చేయడం అవివేకమని ఆరోపించారు. కేంద్ర ఉద్యోగులకు కేవలం 7.5% ఫిట్మెంట్ ఇస్తే రాష్ట్ర ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ ఇచ్చినట్టు గుర్తుచేశారు. దేశం కోసం ధర్మం కోసం అంటూ గ్యాస్, పెట్రో ధరలను ఇష్టారీతిగా పెంచి పేదప్రజల నడ్డి విరువడమే బీజేపీ నీతి అని ఎద్దేవా చేశారు. కొత్తలో సబ్సిడీ ఖాతాలో జమ చేస్తామన్నారని, ఇప్పు డు అది కూడా అడ్రస్ లేకుండా పోయిందని చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో అంగన్వాడీ టీచర్లకు రూ.7,500 వేతనమే చెల్లిస్తున్నారని తెలిపారు. తెలంగాణ వచ్చినప్పుడు అంగన్వాడీ టీచర్లకు రూ.4వేలు, ఆయాలకు రూ.2 వేల జీతం ఉండేదని, ఇప్పు డు రూ.13,500 ఇస్తున్నట్టు చెప్పారు. ఆయాలకు రూ.7,800 వేతనం ఇస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పదిలక్షల మంది ఆడపడుచులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా సాయం చేసినట్టు తెలిపారు. ప్రజలంతా అన్నం పెట్టే చెయ్యేదో, సున్నం పెట్టే చెయ్యేదో గుర్తించి టీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి అండగా నిలవాలని కోరారు.
సొంత జాగాలుంటే డబుల్ బెడ్రూం ఇండ్లు
సొంత స్థలాలు ఉన్న వారికి డబుల్ బెడ్రూం ఇండ్ల మంజూరు కోసం వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని మంత్రి హరీశ్ తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ఇండ్లు వస్తాయని హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టోలో లేని మిషన్ భగీరథ, దళితబంధు తదితర పథకాలను ప్రవేశపెట్టి అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కాళేశ్వరం జలాలతో బెజ్జంకి లాంటి ప్రాంతాలు సస్యశ్యామలంగా మారుతున్నాయంటే సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే సాధ్యమయిందని చెప్పారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రసమయి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణశర్మ పాల్గొన్నారు.