MLA Kunamneni | హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరే ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని ఆటోమెటిక్‌గా రద్దు చేయాలని, పైగా ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసినందుకు వారిపై క్రిమినల్ కేసు పెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఫిరాయింపుదార్ల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం పార్టీ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, పశ్యపద్మ, పల్లా వెంకట్, తకళ్లపల్లి శ్రీనివాస్, ఎన్ బాలమల్లేశ్, ఎం బాలనర్సింహాలతో కలిసి కూనంనేని మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేకు తన సొంత పార్టీ నచ్చకపోతే పదవికి రాజీనామా చేయాలని సూచించారు.
ఇటీవల రాష్ట్రంలో వర్షాల వల్ల సర్వ కోల్పోయి దుఃఖంలో ఉన్న వారిని మానవత్వంతో ఆదుకోవాల్సింది పోయి విపత్తు నిధులకు సంబంధించి గతంలో ఖర్చు చేసిన యూసీలను ముందుగా అందించాలని కేంద్ర మంత్రి కిషనర్రెడ్డి అనడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో అపార నష్టం జరిగిందని, దీనిని కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించి కనీసం రూ.10వేల కోట్లు అందించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా తన ఒక నెల వేతనం రూ.2.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయాలని పార్టీ నిర్ణయించినట్టు ఆయన ప్రకటించారు. ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టులను రాక్షసంగా కాల్చి చంపుతూ కేంద్ర ప్రభుత్వం ఆటవిక యుద్ధానికి తెరలేపిందని కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హింసను వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, కేంద్రం ఆటవిక చర్యలను సమర్థించకూడదని కోరారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి సమస్యలను శాంతియుతంగా పరిషరించాలని సూచించారు.