గోల్నాక, మే 23: ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేసే కుట్రలు మానుకోవాలని, లేదంటే రాష్ర్టా న్ని అగ్నిగుండంలా మారుస్తామని జాతీ య బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. శనివారం కాచిగూడ మహారాజ్ హోటల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశానికి మాజీ స్పీకర్ మధుసూదనాచారి, పలు బీసీ కులసంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. ఫీజుల రీయింబర్స్మెంట్ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ర్టాల్లో పేదలు ఉచితంగా ఉన్నత విద్య, వృత్తి విద్యా కోర్సులు చదువుకొంటుంటే అగ్రకులాల ప్రభుత్వాలు ఓర్వలేక పోతున్నాయని ఆరోపించారు. విద్య అనేది రాజ్యాగ బద్ధమైన హక్కు అని పేర్కొన్నారు.
ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు మేరకు చాలా కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు కట్టాలని ఒత్తిడి చేశాయని వాపోయారు. శ్రీ ఇందు కాలేజీ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక బీటెక్ విద్యార్థి ప్రణీత్ ఆత్మహత్య చేసుకొన్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఫీజుల బకాయిలు రూ.8వేల కోట్లు వెంట నే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.