కారణం ఏదైనా కావొచ్చు రైతు మరణిస్తే ఆ కుటుంబం అనాథ కావొద్దు. ఆ కుటుంబానికి అండగా నిలువాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకే దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నాం. రైతు మరణించిన 10 రోజుల్లో ఆ ఇంటికి రూ. 5 లక్షల చెక్కు వస్తుంది. నా జీవితంలో నేను చేసిన అత్యంత గొప్ప పనిగా దీనిని భావిస్తున్నా.
-రైతు బీమా ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్
Rythu Bima | హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): అన్నదాత కష్టజీవి.. ఆరుగాలం శ్రమిస్తేగానీ తన కుటుంబానికి కడుపునిండా తిండి పెట్టలేని పరిస్థితి. అలాంటి రైతు ఆకస్మికంగా తనువు చాలిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి బతుకుదెరువు ఎలా? ఆర్థిక కష్టాల నుంచి వారిని గట్టెక్కించేదెవరు? ఈ ప్రశ్నల్లోనుంచి పుట్టిందే రైతుబీమా పథకం. ఇంటి పెద్దదిక్కైన రైతు మరణిస్తే ఆ కుటుంబం పడే కష్టాలను దగ్గర నుంచి చూసిన సీఎం కేసీఆర్.. ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వాలని తలంచారు. ‘రైతుబీమా’ పథకాన్ని తీసుకొచ్చారు. దేశానికి అన్నంపెట్టే అన్నదాత ఏవిధంగా మరణించినా అతడి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందేలా ఈ పథకాన్ని రూపొందించారు.
2018 ఆగస్టు 14న ప్రారంభమైన రైతు బీమా పథకం అకాల మరణం చెందిన రైతుల కుటుంబాలకు అండగా నిలిచింది. 2018 నుంచి మొదలుకొని ఇప్పటివరకూ ఈ పథకం ద్వారా పరిహారం పొందిన కుటుంబాల సంఖ్య లక్షకు చేరింది. గడిచిన ఐదేండ్లలో వివిధ కారణాలతో 1,00,782 మంది రైతులు అకాల మరణం చెందినట్టు ప్రభుత్వం గుర్తించింది. రైతు బీమా పథకం కింద ఈ రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ.5,036.10 కోట్లను పరిహారం కింద చెల్లించింది. తద్వారా ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పించింది. రైతు బీమా లెక్కల ప్రకారం అత్యధికంగా 2020-21లో 29,160 మంది రైతులు పలు కారణాలతో మరణించారు. వీరి కుటుంబాలకు రూ. 1,454.25 కోట్ల పరిహారాన్ని అందించింది. ఇక 2018-19లో 17,747 మంది రైతులు చనిపోగా ఆ కుటుంబాలకు రూ.883.30 కోట్లు, 2019-20లో 19,072 మంది రైతులు మరణించగా ఆ కుటుంబాలకు రూ.951 కోట్లు, 2021-22లో 23,232 మంది రైతులు మరణించగా రూ. 1,161 కోట్లు, ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు 2022-23లో 11,779 మంది రైతులు మరణించగా రూ. 588.95 కోట్ల పరిహారాన్ని ఆ కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఎల్ఐసీ చెల్లించింది.
ఉమ్మడి రాష్ట్రంలో రైతులు మరణిస్తే ఎంతో కొంత పరిహారం అందించేవారు. దేశంలోని మిగిలిన రాష్ర్టాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. రైతులకు కేవలం ప్రమాద బీమాను మాత్రమే అమలు చేస్తున్నారు. అంటే రైతు ఏదైనా యాక్సిడెంట్, ఇతర ప్రమాదంలో చనిపోతే మాత్రమే అతడి కుటుంబానికి బీమా వర్తిస్తుంది. లేకుంటే రైతు కుటుంబానికి చిల్లిగవ్వ కూడా రాదు. కానీ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం పూర్తిగా విభిన్నమైంది. రైతు ఏ కారణంతో మరణించినా.. అంటే ఆత్మహత్య చేసుకొన్నా అతడి కుటుంబానికి పరిహారం అందేలా తెలంగాణ సర్కారు జనరల్ బీమాను అమలు చేస్తున్నది. దీనికి సంబంధించి పలు బీమా కంపెనీలతో ఆప్పటి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చర్చలు జరిపారు. తొలుత ప్రమాద బీమాకు సంబంధించి మాత్రమే కంపెనీలతో చర్చించి ప్రీమియం ధరలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, రైతు ఏవిధంగా మరణించినా బీమా అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో పోచారం శ్రీనివాస్‌రెడ్డి సాధారణ బీమాపై చర్చించి రైతు బీమాకు తుదిరూపు ఇచ్చారు.
రైతు బీమా అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసీని బీమా సంస్థగా ఎంపిక చేసింది. అయితే బీమా అమలు చేయాలంటే అర్హులైన రైతులు ప్రతి ఏటా తమ వాటా ప్రీమియంను ఎల్ఐసీకి చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా సగటున 35 లక్షల మంది రైతులు ఈ పథకంలో తమ పేరును నమోదు చేసుకొంటున్నారు. ఈ లెక్కన ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.1500 కోట్లు రైతులు తమ వాటా కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇది రైతులకు ఆర్థికంగా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతులపై పైసా భారం మోపొద్దని కేసీఆర్ నిర్ణయించారు. ఎల్ఐసీకి రైతులు చెల్లించాల్సిన వాటా ప్రీమియంను కూడా రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. దీని ప్రకారం ఐదేండ్లలో రైతుల వాటా కింద ప్రభుత్వం ఎల్ఐసీకి రూ. 5,383.83 కోట్లను ప్రీమియంగా చెల్లించింది. ప్రతి ఏట రైతు వాటా ప్రీమియం పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వెనుకంజ వేయడం లేదు.
రైతు బీమా పథకం ద్వారా వీలైనంత ఎక్కువ మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరేలా అత్యంత సరళమైన నిబంధనలను రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు గుంట (120 గజాలు) భూమి తన పేరుపై ఉండి పాస్ పుస్తకం ఉన్న రైతుకు కూడా ఈ పథకం వర్తించేలా నిబంధనలు రూపొందించారు. తద్వారా మెజార్టీ రైతులకు ఈ పథకం ద్వారా భరోసా లభిస్తున్నది. బీమా సంస్థల నిబంధనల ప్రకారం జనరల్ ఇన్సూరెన్స్ కింద 18-59 ఏళ్ల వయసుగల వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకొంటారు. దీంతో ఈ పథకాన్ని ఈ మధ్య వయసువారికే వర్తింపజేస్తున్నారు. దీంతో 59 ఏండ్లలోపు అన్నదాత ఏవిధంగా మరణించినా అతడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందుతున్నది.
మాది పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరాత్పల్లి. చాలా నిరుపేద కుటుంబం. నా భర్త మామిడి అయిలయ్య గొర్లు కాసేది. మాకు ఇద్దరు కొడుకులు ఉన్నరు. నా భర్త గొర్లు మేపేందుకు రోడ్డుపోంటి నడుచుకుంటూ వెళ్తుంటే.. 2020 అక్టోబర్ 10న వెనుక నుంచి వచ్చిన బండి ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయిండు. ఆయన పేరు మీద పట్టా భూమి ఉంది. రూ.5 లక్షల బీమా చెక్కును ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఇచ్చిండు. వచ్చిన డబ్బులతో కొన్ని అప్పులు తీర్చిన. కైకిలి చేసుకొని ఇద్దరు కొడుకులను చదివించుకుంటున్న. నా భర్త చనిపోయినప్పుడు ఎట్ల బతుకుడురా దేవుడా అని కుమిలి పోయిన. సీఎం కేసీఆర్ కన్న తండ్రోలే ఆదుకున్నడు. జీవితాంతం రుణపడి ఉంటాం.
-మామిడి అనూష, పెద్దరాత్పల్లి, పెద్దపల్లి జిల్లా
గతంలో రాష్ర్టాన్ని పాలించిన వాళ్లంతా రైతు కుటుంబాలను పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పెద్దన్నలా మా కుటుంబాన్ని ఆదుకున్నడు. నా భర్త పుప్పాల సోమయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. పుట్టెడు దుఃఖంలో ఉన్న నా కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. నా భర్త చనిపోయిన రోజే వ్యవసాయ అధికారులు వచ్చి వివరాలు తీసుకున్నారు. ఎలాంటి పైరవీ లేకుండా పది రోజుల్లోనే నా బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షలు జమ చేసిండ్లు. ఈ డబ్బులతో కొన్ని అప్పులు తీర్చిన. సీఎం ఇచ్చిన భరోసాతో నా కుటుంబం అప్పుల బాధ నుంచి బయటపడింది. ప్రజల కోసం ఆలోచించే నాయకుడిని నేను ఇప్పటి వరకు చూడలేదు. సీఎం కేసీఆర్‌కు మా కుటుంబం రుణపడి ఉంటుంది.
-పుప్పాల నర్సమ్మ, కొమ్ములవంచ(నర్సింహులపేట మండలం, మహబూబాబాద్)
మాది గీతకార్మిక కుటుంబం. నా భర్తకు షుగర్ వ్యాధి కారణంగా కాలు తీసేశారు. దీంతో తాళ్లెక్కరాకపోయేది. నేనే కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించేది. ఇంతలోనే షుగర్ ఎక్కువై నా భర్త పరీదుల రమేశ్(46) ఏడాది కింద చనిపోయిండు. ఆయన పేరుమీద మూడెకరాల భూమి ఉంది. రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని మా ఊళ్ల నాయకులు చెప్తే చేసిన. తొందరగానే రూ.5 లక్షలు నా బ్యాంకు ఖాతాలో పడ్డయ్. పైసలు రాంగనే అప్పులు కట్టిన. నాకు కూతురు మౌనిక, కుమారుడు సందీప్ ఉన్నారు. బీమా డబ్బులు ఆసరా కాకపోతే అప్పులు తీరకపోవు. కేసీఆర్ ఇస్తున్న రైతుబీమా మంచి పథకం.
-పరీదుల మంజుల, రైతుకూలీ, చినమడూరు(జనగామ జిల్లా)
మేడారం పున్నమి అప్పుడు ములుగులో నా భర్త కందికొండ శ్రీను లారీ కిందపడి చనిపోయిండు. పిల్లలు, నేను దిక్కులేని వాళ్లమైనం. గ్రామపంచాయతీలో నా భర్త డెత్ సర్టిఫికెట్ తీసుకొని వ్యవసాయ అధికారులను కలిసిన. వివరాలన్నీ రాసుకొని పంపించిన్రు. వారం తర్వాత రైతుబీమా డబ్బులు రూ.5 లక్షలు నా బ్యాంకు ఖాతాలో పడ్డాయి. పుట్టెడు దుఃఖంలో ఉన్న నాకు రైతుబీమా కింద రూ.5 లక్షలు రావడం కొండంత అండగా అనిపించింది. రూపాయి ఖర్చు లేకుండా పైసలు చేతికి వచ్చినయ్.
-కందికొండ లలిత, ములుగు జిల్లా