‘మేం అధికారంలోకి వస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం’.. ఏ రాజకీయ పార్టీ అయినా చెప్పేది ఇదే. కాంగ్రెస్ మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. తామొస్తే రాష్ర్టాన్ని దశాబ్దాల వెనక్కి నెట్టేస్తామని ప్రచారం చేసుకుంటున్నది. 24 గంటల ఉచిత కరెంటు స్థానంలో మూడు గంటల కరెంటిస్తామని, మంచిగున్న ధరణిని ఎత్తేసి ఏండ్లనాటి పట్వారీ వ్యవస్థ తెస్తామని చెప్తూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. మంచిగ ఉన్నదాన్ని తీసుడెందుకో, కొత్తదాన్ని పెట్టుడెందుకో అర్థంకాక రైతులు తలలు పట్టుకున్నారు. మీరొద్దు.. మీ పాలనొద్దంటూ ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. తమ జోలికి వస్తే బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ‘మీకు ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ భూమి ఉంటే, పట్టాదారు పాస్ పుస్తకం ఒక్కటే సరిపోదు. ప్రతి సంవత్సరం కచ్చితంగా పహాణీ కాపీ తీసుకొని దగ్గర పెట్టుకోండి. అందులో మీ పేరు ఉన్నదో లేదో చూసుకోండి. సేత్వార్ రికార్డును కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే మీ భూమి ఎప్పుడైనా మీది కాకుండా పోవచ్చు’.. ఒకప్పుడు భూ నిపుణులు, న్యాయ నిపుణుల సూచనలివి. ఉమ్మడి రాష్ట్రంలో భూముల రికార్డుల నిర్వహణ ఎంత అధ్వానంగా ఉండేదో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. గ్రామ స్థాయి, మండలస్థాయి అధికారుల చేతుల్లో అధికారం ఉన్నప్పటి అవినీతి గురించి దేశవ్యాప్తంగా చర్చ నడిచేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పట్వారీ వ్యవస్థ ఉన్న సమయంలో భూముల రికార్డులు, రైతుల తలరాతలు ఎంత సులభంగా మారిపోయేవో ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. 1814లో బ్రిటిష్ ప్రభుత్వం పట్వారీల నియామకాలను చట్టబద్ధం చేసింది.
అప్పటి నుంచి చేతిరాత పద్ధతిలో భూముల రికార్డులు నిర్వహించేవారు. వారు ఎవరి పేరు రాస్తే వాళ్లే యజమానులు. కలం పోటుతో రైతుల తలరాతలు మార్చేసేవారు. ఎన్టీఆర్ హయాంలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి.. ఎమ్మార్వోలు, ఆర్ఐలు, వీఆర్వోలతో రెవెన్యూ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అయితే అధికారుల నిర్వాకం వల్ల రైతుల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది. పహాణీ రికార్డులు వీఆర్వోల ఇండ్లలో ఉండటంతో వాళ్లు రాసిందే రాత, గీసిందే గీత అన్నట్టు సాగింది. తెల్లారేసరికి పహాణీల్లో పేర్లు మారిపోయేవి. దీంతో పంటలు పండించాల్సిన రైతులు.. వీఆర్వో నుంచి నుంచి సీసీఎల్ఏ వరకు, కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఏండ్లకేండ్లు ప్రదక్షిణలు చేశారు. నాట్లు వేయాల్సిన చేతితో దండాలు పెట్టాల్సి వచ్చేది.
ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఈ చిక్కుముడులన్నింటినీ పరిష్కరించారు. 2017లో భూ రికార్డుల ప్రక్షాళణతో రికార్డులన్నీ డిజిటలైజ్ కాగా, 2020లో ధరణి పోర్టల్‌తో పారదర్శక, వేగవంతమైన లావాదేవీలు మొదలయ్యాయి. భూ రికార్డుల నిర్వహణ అధికారుల చేతుల్లో నుంచి వెళ్లిపోయింది. అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరిగిపోతున్నాయి. రైతుల వివరాలు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, ఏ క్షణమైనా పోర్టల్‌లో చెక్ చేసే అవకాశం కలిగింది. రైతు వచ్చి వేలిముద్ర వేస్తే తప్ప పట్టా మార్పిడి జరగదు. అప్పటి నుంచి రైతులు తమ భూముల రికార్డులు భద్రంగా ఉన్నాయని గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోతున్నారు. ధరణిని రద్దు చేస్తామని, పాస్ పుస్తకంలో పాతకాలంలో ఉన్నట్టుగా ‘కాలమ్’లు పెంచుతామని కాంగ్రెస్ పదేపదే చెప్తున్నది.
భూమి హక్కులకు సంబంధించి తెలంగాణలో రెవెన్యూ అధికారులు నిర్వహించేందుకు మొత్తం 11 రకాల రికార్డులు ఉంటాయి. అన్నింటా కలిపి సుమారు 200 కాలమ్స్ ఉండేవి. వీటిని నిర్వహించేందుకు ప్రత్యేకంగా సిబ్బంది ఉండేవారు. ఇదే తరహాలో మళ్లీ పాత కాలానికి తీసుకెళ్తామని కాంగ్రెస్ చెప్తున్నది. వీఆర్వో పోస్టులు భర్తీ చేస్తామని బాజాప్తా మ్యానిఫెస్టోలోనే ప్రకటించింది. అంటే.. మళ్లీ వీఆర్వోలను నియమించి, గ్రామస్థాయిలోనే రైతుల భూములను ఇష్టం వచ్చినట్టు మార్చే పాత, రాత పద్ధతిని తీసుకొస్తామని చెప్పింది. దాంతో రాత్రికి రాత్రే రైతుల తలరాతలు మారిపోయే కాలం వస్తుంది. ఇదే జరిగితే ప్రశాంతంగా ఉన్న రైతులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసే పాత రోజులు మళ్లీ వస్తాయి.
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్‌ను తీసేస్తే రైతులు వివరాలన్నీ ఆగమాగం అవుతాయి. రైతులు, కౌలురైతులు అంటూ రికార్డులన్నీ గందరగోళంగా తయారవుతాయి. దీంతో అసలు ఒక రైతును రైతుగా ఎవరు గుర్తిస్తారన్నదే పెద్ద సమస్యగా మారుతుంది. నేను రైతును అంటూ సర్టిఫికెట్లు తెచ్చుకోవాల్సి వస్తుంది. రికార్డు పారదర్శకంగా లేకపోతే రైతుబంధు అందించే అవకాశమే ఉండదు. ప్రస్తుతం సొంత ఊరిలోనే కాంట పెడుతున్నారు. కొనుగోళ్లు వెంటవెంటనే పూర్తవుతున్నాయి. డబ్బు నేరుగా అకౌంట్లో పడుతున్నది. ఈ సౌలభ్యాన్ని కూడా కాంగ్రెస్ ఎగవేయాలని చూస్తున్నది. ‘చిట్టీల సంస్కృతి’ తేవాలని చూస్తున్నది.
ధరణి వచ్చాక ప్రతి రైతు వివరాలు ఆన్లైన్లో రికార్డయ్యాయి. ఈ రికార్డు ప్రభుత్వంతోపాటు అటు ఎల్ఐసీ దగ్గర ఉన్నది. రైతు మరణిస్తే.. ఆ వ్యక్తికి నిజంగా భూమి ఉన్నదో లేదో ధరణిలో చూస్తే తెలిసిపోతుంది. వెంటనే టిక్ కొట్టి ప్రీమియం కోసం దరఖాస్తు చేస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు ఆన్లైన్లోనే రైతు వివరాలను సరిచూసుకొని, ప్రీమియం మొత్తాన్ని అకౌంట్లో వేస్తున్నారు. ఇంతటి సౌలభ్యాన్ని కాంగ్రెస్ వాళ్లు పోగొట్టాలని చూస్తున్నారు.