Inter Colleges | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : ‘పిల్లలు క్లాసులకు డుమ్మా కొట్టారనుకోండి. సాయంత్రం కల్లా తల్లిదండ్రుల ఫోన్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ రోజు మీ పిల్లలు కాలేజీకి గైర్హాజరయ్యారని సమాచారమందుతుంది. ఇలా నాలుగైదు రోజులు గైర్హాజరైతే ఏకంగా ఫోన్‌కాలే వస్తుంది. డుమ్మాల వ్యవధి వారం దాటితే తల్లిదండ్రులు నేరుగా కాలేజీకి వెళ్లి ప్రిన్సిపాల్‌కో.. లెక్చరర్లకో వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది” అచ్చం ఇలాంటి హాజరు పర్యవేక్షణ విధానాన్నే సర్కారు జూనియర్ కాలేజీల్లో అమలుచేయాలని ఇంటర్‌విద్య అధికారులు నిర్ణయించారు.
2025-26 విద్యాసంవత్సరం నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్‌ను(ఎఫ్ఆర్ఎస్) విద్యార్థులతోపాటు లెక్చరర్లకు తప్పనిసరిచేయనున్నారు. జూన్ కల్లా కాలేజీలన్నింటిలో ఎఫ్ఆర్ఎస్ ఉపకరణాలను బిగిస్తారు. జూన్ నుంచి నూతన హాజరు విధానాన్ని అమలుచేస్తారు. కాలేజీల్లో ఈ విధానంతో విద్యార్థుల హాజరును పర్యవేక్షించడమే కాకుండా తల్లిదండ్రులకు సమాచారాన్ని చేరవేస్తారు. దీంతో విద్యార్థుల గైర్హాజరు తగ్గించవచ్చని, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయవచ్చని అధికారులంటున్నారు.
రాష్ట్రంలో 420 సర్కారు జూనియర్ కాలేజీలున్నాయి. ఈ కాలేజీల్లో 1.6లక్షల మంది విద్యార్థులు ఉండగా, వారి హాజరు ఆందోళన కలిగిస్తున్నది. సగటున 40శాతం మంది విద్యార్థులు కూడా క్లాసులకు హాజరుకావడంలేదు. ఇటీవలే ఇంటర్ విద్య డైరెక్టరేట్ అధికారులు జిల్లాలవారీగా పరిశీలకులను నియమించి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. ఓ కాలేజీలో 183 మందికి 10 మంది మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత 20 మంది, మధ్యాహ్నానికి 40 మంది మాత్రమే క్లాసులకొచ్చారు.
ఇక మరో కాలేజీలో 100 మందికి 10, ఇంకో కాలేజీలో 600 మందికి సగం మంది డుమ్మాకొట్టారు. నల్లమల అటవీ ప్రాంతంలోని మరో కాలేజీలో 300 మందికి 30 మంది మాత్రమే హాజరయ్యారు. కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లోని పలు కాలేజీల్లోనూ విద్యార్థుల హాజరు తక్కువగా ఉన్నట్టుగా అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో హాజరుశాతం పెంచడం, పర్యవేక్షణ జరిపేందుకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలుచేయాలని నిర్ణయించారు.