ఇందిరమ్మ ఇండ్ల వైశాల్యాన్ని కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. మొదట 350 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా నిర్మించుకోవచ్చని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా 600 చదరపు అడుగులకు మించరాదని, ఒకవేళ మించితే ఇంటి నిర్మాణం ప్రారంభమైనా రద్దుచేస్తామని స్పష్టం చేసింది. కేంద్ర నిబంధనలే ఇందుకు కారణమని తెలిసింది. కేంద్ర నిబంధనల ప్రకారం ఇండ్ల నిర్మాణం లేకుంటే ఆర్థికసాయం అందే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే రేవంత్ ప్రభుత్వం అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమచారం.
Indiramma Indlu | హైదరాబాద్, మే 3(నమస్తే తెలంగాణ): నిరుపేదలకు మాత్రమే ఇండ్లు మంజూరయ్యేలా కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై నిబంధనలను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నది. పీఎంఏవై (అర్బన్), పీఎంఏవై (గ్రామీణ్) పేరుతో రెండు విధాలుగా కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది.గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో యూనిట్‌కు రూ. 1.2 లక్షలు, కొండ ప్రాంతాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ర్టాలకు రూ.1.3 లక్షల చొప్పున కేంద్రం సాయం అందిస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో అయితే రూ. 2.5 లక్షల వరకు ఆర్థికసాయం అందిస్తున్నది. అర్బన్‌లో ఇంటి వైశాల్యం 30 చ.మీ., గరిష్ఠంగా 45 చ.మీ. మించరాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి వైశాల్యం 25 చదరపు మీటర్లకు తగ్గకుండా ఉండాలన్న నిబంధన ఉన్నది. ఇంతకంటే ఎక్కువ వైశాల్యంలో నిర్మించాలనుకుంటే కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు నిరుడు చివర్లోనే కేంద్రం స్పష్టమైన నిబంధనలు విడుదల చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిని గుర్తించకుండా ఎంత వైశాల్యంలోనైనా నిర్మించుకోవచ్చని మొదట చెప్పింది. మొదటి విడత ఇండ్ల నిర్మాణం మొదలయ్యాక కేంద్ర సాయం కోసం దరఖాస్తు చేసిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనలు చూసుకుని జరిగిన పొరపాటును గుర్తించింది.
ఇప్పుడేం చేద్దాం?
ఈ ఏడాది 4.5 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 72,045 ఇండ్లను మంజూరు చేసింది. ఇందులో చాలావరకు గ్రౌండ్ అయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం పునాదులు పూర్తయ్యాక మొదటి ఇన్స్టాల్మెంట్ విడుదల చేయాల్సి ఉంది. అయితే కొన్ని ఇండ్లు 600 చదరపు అడుగులకన్నా అధికంగా ఉండటంతో వాటికి కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఏమి చేయాలో అర్థంకాక రాష్ట్ర ప్రభుత్వం తలపట్టుకుంటున్నది. అదనపు వైశాల్యంలో నిర్మించుకున్న ఇండ్లను రద్దుచేయాలా? లేక కేంద్రంతో సంబంధం లేకుండా రూ. 5 లక్షలు మొత్తం తమ ఖజానా నుంచే ఇవ్వాలా? అన్న విషయాన్ని తేల్చుకోలేకపోతున్నది.
పట్టణ ప్రాంతాలకు అధిక సాయం
గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం అధికంగా నిధులు విడుదల చేస్తున్నది. గృహనిర్మాణ పథకంలో సైతం పట్టణ ప్రాంతాల్లో ఒక్కో యూనిట్‌కు రూ. 2.5 లక్షలుగా ఆర్థిక సాయం అందిస్తున్నది. తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి మొత్తం 147 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. ఇందులో జీహెచ్ఎంసీ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, ఖమ్మం తదితర 15 మున్సిపల్ కార్పొరేషన్లు కాగా, 131మున్సిపాలిటీలు ఉన్నాయి. దీంతో పీఎంఏవై(అర్బన్)లో భాగంగా ఈ ప్రాంతాల్లో మంజూరయ్యే ఇండ్లకు ఒక్కో యూనిట్‌కు రూ. 2.5 లక్షల చొప్పున సాయం అందుతుంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణాల్లో నిర్మించే ఇండ్లకు రాష్ట్ర ప్రభుత్వంపై తక్కువ భారం పడుతుంది.
రూ. 5 లక్షలు
ఇస్తున్నది మేమే పేదల ఇండ్లకు యూనిట్‌కు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రూ.22 వేల కోట్లతో ఏడాదికి 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపికను త్వరలోనే పూర్తిచేస్తామని, పైలట్ గ్రామాల్లో ఇప్పటికే ఇండ్ల నిర్మాణం చురుగ్గా సాగుతున్నదని వివరించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్‌లో) శిక్షణ పూర్తిచేసుకున్న 350 మంది గృహనిర్మాణ సంస్థ ఔట్సోర్సింగ్ ఇంజినీర్లకు శనివారం మంత్రి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఒక్కరికే రూ. 5 లక్షలు అందిస్తున్న పథకం లేదని చెప్పారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రం ఇచ్చే నిధులతోనే సరిపెడుతున్నాయని పేర్కొన్నారు. వివిధ దశల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ప్రతీ సోమవారం చెల్లింపులు చేస్తున్నామని మంత్రి వివరించారు.
ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామస్థుల ధర్నా
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో పేదలమైన తమకు అన్యాయం చేసిండ్రని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం హత్తిని గ్రామస్థులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రామ సభలు నిర్వహించకుండానే కాంగ్రెస్ నాయకులు, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు, కార్యదర్శులు కుమ్మక్కై డబ్బులు తీసుకొని వారికి నచ్చిన వాళ్లకు ఇండ్లు కేటాయించారని ఆరోపించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. – దహెగాం
సారూ.. నేను చచ్చిపోకముందే ఇల్లు ఇప్పించండి ‘నాకు గుండె జబ్బు ఉంది.. నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు, నేను చనిపోకముందే నా కుటుంబానికి ఇల్లు ఉండాలన్నదే కోరిక.. ఇందిరమ్మ ఇండ్ల మొదటి జాబితాలో ఇవ్వలే.. రెండో జాబితాలో వస్తుందని ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెప్తున్నరు.. అధికారులు దయచేసి ఇల్లు ఇప్పించండి సారూ..’ అని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం గ్రామానికి చెందిన షేక్ పాషా అధికారులను దీనంగా వేడుకున్నాడు. ఇందిరమ్మ లిస్టులో నా పేరు 17వ నంబర్లో ఉంది.. మా గ్రామంలో 16 ఇండ్లు మాత్రమే మంజూరు చేశారు. నాకు రెండో లిస్టులో ఇల్లు ఇస్తామని చెప్పి 16మంది పేర్లను ప్రకటించారు. కానీ నాకంటే పేదలు ఎవరైనా ఉంటే ఇవ్వండి లేదా నాకు ఇవ్వండి..’ అని రోదిస్తూ షేక్‌పాషా వేడుకుంటున్నాడు.- మరిపెడ
భట్టి సారూ.. ఇల్లు ఉన్న వారికేనా మాకు ఇవ్వరా?
‘భట్టి సారూ.. ఇల్లు ఉన్న వారికే మళ్లీ మళ్లీ ఇల్లు ఇస్తున్నారు. లేని వారికి ఇవ్వరా? మాలాంటి పేదవారికి ఇల్లు ఇవ్వకపోతే ఎలా సార్’ అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పలువురు మహిళలు నిలదీశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న భట్టిని కొం దరు మహిళలు కలిసి ఇండ్ల సమస్య గురించి విన్నవించారు. ఇప్పటికీ ఎవరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూ రు కాలేదని, ఎవరో చెప్పిన మాటలు నమ్మొద్దని డిప్యూటీ సీఎం భట్టి మహిళలకు చెప్పారు. – మధిర
ఇండ్ల కోసం ట్యాంకు ఎక్కి నిరసన
జూలూరుపాడు: ఇందిరమ్మ ఇండ్ల జాబితా నుంచి అనర్హుల పేర్లు తొలగించి.. అర్హులకే ఇండ్లు కేటాయించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బేతాళపాడు పంచాయతీ పరిధిలోని రేగళ్లతండాకు చెందిన గిరిజనులు శనివారం వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. పేదలకు ఇండ్లు కేటాయించకుండా ఆస్తులు ఉన్న వారికి కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. అనర్హులకు కేటాయించిన ఇండ్లను రద్దు చేసే వరకు కిందికి దిగేది లేదని భీష్మించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగి నిరసన విరమించారు.
నేను కాంగ్రెస్ కార్యకర్తనే.. నాకూ ఇల్లియ్యలే..
‘నేను కాంగ్రెస్ కార్యకర్తనే. పార్టీ అధికారంలోకొస్తే ఇందిరమ్మ ఇల్లు వస్తదని అశపడ్డ. డోర్నకల్ ఎమ్మెల్యేగా రాంచంద్రునాయక్ గెలవగానే కురవి వీరభద్రస్వామికి తలనీలాలిచ్చిన.. నాకు మాత్రం ఇల్లు ఇయ్యలే’ అని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారానికి చెందిన చల్లమల్ల సోమయ్య ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. తనకు ఇల్లివ్వాలని మొరపెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.