హైదరాబాద్ : రాష్ట్రంలో ధాన్యం సేకరణ రాబోయే పదిరోజులు మరింత కీలకం కాబోతున్న నేపథ్యంలో ధాన్యం అన్లోడింగ్ సమస్య ఉత్పన్నం కావద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్(Video Conference)లో మంత్రి మాట్లాడారు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ ధాన్యం సేకరణ చేస్తున్న కలెక్టర్లకు, జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. మిల్లుల వద్ద స్టోరేజీ లేని చోట, మిల్లులు సహకరించని చోట తక్షణమే ఇంటర్మీడియట్ గోదాంలను తీసుకొని అన్లోడింగ్(Un Loading) చేయాలని సూచించారు. ఇంటర్మీడియట్ గోదాములు హైర్ చేసే అవకాశం లేని జిల్లాలు, తమ చుట్టు పక్కల జిల్లాల్లో సైతం ఏర్పాటు చేసుకోవాలన్నారు.
రాష్ట్ర సరిహద్దులకు సమీపంలో గల జగ్గయ్యపేట్, రాయచూర్, బీదర్ తదితర ప్రాంతాల్లో సైతం ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ ఇంటర్మీడియట్ గోదాముల్లో దించే ధాన్యంతో మిల్లర్లకు ఎటువంటి సంబంధం ఉండకూడదన్నారు. అదేవిధంగా రైతులకు సకాలంలో డబ్బులు అందేలా చూడాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్(CM KCR) రైతు పక్షపాతి అని, వ్యవసాయం పండగ చేసేలా అవసరమైన నీళ్లు, ఉచిత కరెంటు, పెట్టుబడి సాయం అందజేస్తూ రైతులకు కనీస మద్దతు ధరను అందిస్తున్నారని తెలిపారు.
పొరుగు రాష్ట్రాల ధాన్యం రాకుండా చర్యలు తీసుకోవాలి
పొరుగు రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్లు లేనందున అక్కడి ధాన్యం తెలంగాణలోకి రాకుండా పటిష్ట రక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రైతు ప్రయోజనాలే కేంద్రంగా పనిచేసి ధాన్యం సేకరణ చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఈ సమయంలో అక్కసుతో ప్రతిపక్షాలు చేసే రాజకీయాలను పట్టించుకోవద్దని తెలిపారు. కేవలం రైతులు కేంద్రం నిర్దేశించిన ఎఫ్.ఏ.క్యూ ప్రమాణాలతో ఖచ్చితంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేందుకు రైతుల్లో అవగాహన పెంచాలని కోరారు.
ధాన్యం సేకరణకు గాను ట్రాన్స్ పోర్ట్ సమస్య ఉన్న చోట ప్రత్యామ్నాయాలను ఎంచుకొని స్థానిక ట్రాక్టర్లను సైతం వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, కమిషనర్ అనిల్ కుమార్, జీఎంలు రాజారెడ్డి, శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు.