Assembly Elections | న్యూఢిల్లీ, మార్చి 11: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీదే అఖండ విజయమని తేలింది. తిరుగులేని మెజారిటీతో గులాబీ దళం తిరిగి అధికారంలోకి వస్తుందని స్పష్టమైంది. తెలంగాణలో గరిష్ఠంగా 87 సీట్లలో బీఆర్ఎస్ జయకేతనం ఎగరేయడం పక్కా అని తేలిపోయింది. అదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని వెల్లడైంది. ఆ పార్టీ గెలిచేది 21 సీట్లలోపేనని తేలింది. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ఏడాది పాలనపై ఢిల్లీకి చెందిన ఓ జాతీయ మీడియా సంస్థ ఇటీవల రాష్ట్రంలో సర్వే నిర్వహించింది. ఫిబ్రవరి చివర్లో నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ఇందులో వెల్లడైంది. ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, ఆ పార్టీపై సానుభూతి పెరుగుతున్నదని ఆ సర్వే పేర్కొన్నది.
కాంగ్రెస్ పాలనతో పోల్చితే కేసీఆర్, బీఆర్ఎస్ పాలన వందరెట్లు నయమనే అభిప్రాయం వ్యక్తమైనట్టు సర్వే తెలిపింది. మార్పు కోసం ఓ అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో కాంగ్రెస్కు ఓటు వేశామని, అయితే అది తప్పుడు నిర్ణయంగా తేలిందని ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు వెల్లడించింది. జాతీయ స్థాయిలో పేరున్న ఈ సంస్థ దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లోనూ ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలోనూ, ఎన్నికల తర్వాత సర్వేలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఇక్కడ పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రభుత్వంపై ప్రజలు ఏ అభిప్రాయంతో ఉన్నారనే అంశాలపై ఫిబ్రవరి మూడు, నాలుగు వారాల్లో సర్వే నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 119 నియోజకవర్గాల్లో 3,213 మంది అభిప్రాయాలను సేకరించింది. సర్వేలో భాగంగా తెలంగాణను నాలుగు జోన్లుగా విభజించింది. జీహెచ్ఎంసీ, హైదరాబాద్ శివార్లు, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణగా విభజించి సర్వే నిర్వహించింది. అయితే ఫలితాలను మాత్రం మూడు జోన్లుగా లెక్కించారు. ఈ సర్వే వివరాలను ‘నమస్తే తెలంగాణ’ సంపాదించింది.
కాంగ్రెస్కు 21లోపే… బీఆర్ఎస్కు 87
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి ఓటు వేస్తారు? అన్న ప్రశ్నకు తెలంగాణ ప్రజల నుంచి సంచలన అభిప్రాయం వెల్లడైంది. మెజార్టీ ప్రజలు సీఎంగా కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని కోరుకున్నట్టు తేలింది. 2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు, బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్నికలు జరిగితే మొత్తం 119 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ కేవలం 14 నుంచి 21 సీట్లలో మాత్రమే గెలుస్తుందని వెల్లడైంది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 73-87 సీట్లు గెలుచుకొని అఖండ విజయం సాధిస్తుందని స్పష్టమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ గుండు సున్నా ఖాయమని సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ ఉత్తర తెలంగాణలో 7-9 సీట్లు, దక్షిణ తెలంగాణలో 7-12 సీట్లు మాత్రమే గెలుస్తుందని సర్వే పేర్కొంది. ఇక బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ పరిధిలో 17 సీట్లు, ఉత్తర తెలంగాణలో 28-38 సీట్లు, దక్షిణ తెలంగాణలో 28-32 సీట్లు గెలుస్తుందని వెల్లడించింది. బీజేపీ ప్రస్తుతం 8 సీట్లలో గెలుపొందగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దానికి 6-11 సీట్లు వచ్చే అవకాశం ఉందని, ఇతర పార్టీలు 6-7 సీట్లు గెలుస్తాయని పేర్కొంది. గత అసెబ్లీ ఎన్నికల్లో కేవలం 1.8శాతం ఓట్ల తేడాతో బొటాబొటి మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం అతికొద్ది కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నట్టు సర్వేలో వెల్లడైంది.
పాలనలో రేవంత్ సర్కారు వైఫల్యం
పరిపాలనలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ముఖ్యంగా వ్యవసాయానికి పెట్టుబడి సాయం ఇవ్వకపోవడం, రుణమాఫీ పూర్తి చేయకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు సర్వే సంస్థ పేర్కొంది. మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడంతో రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిందనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రభుత్వంలో పైనుంచి అట్టడుగు స్థాయి దాకా అవినీతి వేళ్లూనుకుపోయిందని, కరువు, కష్టాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా.. ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేదని ప్రజలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ గురించి కేసీఆర్కు తెలిసినంతగా కాంగ్రెస్కు తెలియదని ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు సర్వేలో వెల్లడైంది. అందుకే ఇప్పటికిప్పుడు అవకాశం వస్తే మరో ఆలోచన లేకుండా కేసీఆర్ పార్టీకి ఓటు వేస్తామని పేర్కొన్నారు.
బీఆర్ఎస్పైనా ప్రజలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు సర్వే పేర్కొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలను అలాగే కొనసాగించడం పట్ల రెస్పాండెంట్లలో కొంత అసంతృప్తి కనిపించింది. ప్రజల పక్షాన ప్రభుత్వంపై మరింత దూకుడుగా పోరాడాల్సి ఉన్నా అది చేయడం లేదనే అభిప్రాయమూ వ్యక్తమైంది. అయినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయమనే అభిప్రాయం వ్యక్తమైంది. కాంగ్రెస్ పార్టీ పాలనలో పూర్తిగా విఫలమవడం, ప్రతిపక్షంగా బీజేపీ తన పాత్రను పోషించలేకపోవడంతో 14 నెలల కాలంలోనే బీఆర్ఎస్ వేగంగా తన బలాన్ని సముపార్జించుకున్నట్టు సర్వేలో వెల్లడైంది. బీజేపీకి రాష్ట్రంలో సరైన నాయకత్వం లేకపోవడం, రాష్ట్ర పార్టీ మోదీ ఫొటోను మాత్రమే నమ్ముకోవడంతో తెలంగాణ కోణంలో ప్రజలు ఆ పార్టీవైపు చూడటం లేదని వెల్లడైంది. కాంగ్రెస్ ప్రస్తుత నాయకత్వం ఎవరికి వారే యమునా తీరే అనేలా సర్కారును నడపడం, పాలనలో సమన్వయం లేకపోవడం, అధికారులపై పట్టు లేకపోవడం తదితర అంశాలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.