GHMC | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): వెంగళరావునగర్‌లోని ఒక వ్యక్తిగత నివాస గృహం.. అందులో మొత్తం ఏడు విద్యుత్తు కనెక్షన్లు వాడుకలో ఉన్నాయి. ఈ మొత్తం విద్యుత్తు కనెక్షన్ల నుంచి 29 కిలోవాట్ల విద్యుత్తు వినియోగమవుతున్నది. కాంట్రాక్టెడ్ లోడ్ మొత్తం 29 కిలోవాట్లు ఉండటంతో సొంతంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకోవాలంటూ శ్రీకృష్ణానగర్ సెక్షన్ ఆపరేషన్స్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆ ఇంటి యజమానికి నోటీసు జారీ చేశారు.
ఆస్మాన్‌గఢ్ పరిధిలోని వివేకానందనగర్, పీ అండ్ టీ కాలనీలో ఒక ఇంటి యజమానికి మొత్తం 12 విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వాటి మొత్తం కాంట్రాక్టెడ్ లోడ్ 25 కిలోవాట్లు దాటింది. దీంతో సొంతం ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసుకోవాలంటూ అస్మాన్‌గఢ్ అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్ ఆ ఇంటి యజమానికి నోటీసు జారీ చేశారు.
సొంతంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలంటూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వందలాది మందికి విద్యుత్తు శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఒక్క డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ (డీటీఆర్) ఏర్పాటు చేసుకోవాలంటే ఎంత లేదన్నా ఒక్కో భవన యజమాని రూ.2 లక్షల నుంచి నాలుగు లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఎప్పుడో కట్టుకొని అందులో నివాసం ఉంటున్న భవనాలకు ఇప్పుడు విద్యుత్తు శాఖ అధికారులు నోటీసులు ఇవ్వడం ఏమిటని వినియోదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలపై ఊహించని రీతితో ఆర్థిక భారాన్ని మోపడం అన్యాయమని ఆక్రందిస్తున్నారు. కొత్తగా నిర్మించే అపార్టుమెంట్లకు, పది కనెక్షన్లకు మించి ఉంటే సొంతం ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్తే కొంతవరకు అంగీకరించవచ్చు. కానీ, కొన్నేండ్ల క్రితం ఇండ్లు నిర్మించుకొని, అవసరమైన మేర విద్యుత్తు కనెక్షన్లు తీసుకొని కరెంటు వాడుతుండగా ఇప్పుడు తనిఖీలు చేసి 20 కిలోవాట్లు దాటితే సొంతంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలంటూ నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫీడర్ల వారీగా సర్వే చేపట్టింది. ఆ సమయంలో సబ్స్టేషన్ల నుంచి ఇంటింటికీ విద్యుత్తు సరఫరా చేసేందుకు విద్యుత్తు శాఖ ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లపై అధిక లోడు పడుతున్నట్టు గుర్తించారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 1.85 లక్షల వరకు కాలనీలు, బస్తీలు, అపార్టుమెంట్లలో ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. వాటిలో అపార్టుమెంట్లు మినహా పబ్లిక్ ట్రాన్స్ఫార్మర్ల నుంచి వ్యక్తిగత ఇండ్లకు వెళ్లిన విద్యుత్తు కనెక్షన్లతో ఓవర్‌లోడ్ అవుతున్నట్టు గుర్తించారు. అయితే ఓవర్‌లోడ్ సమస్య ఉన్నచోట ఆయా ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచాల్సిందిపోయి, విద్యుత్తు వినియోగదారులపై భారం మోపేలా సొంతంగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవాలంటూ నోటీసులు జారీ చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది.
హుమాయూన్‌నగర్‌లో 15 ఏండ్ల క్రితం బిల్డింగ్ కట్టుకున్నాను. నాతోపాటు నా తమ్ముళ్ల కుటుంబాలే ఉంటున్నాయి. మొత్తం ఆరు కరెంటు మీటర్లు ఉన్నాయి. సొంతంగా ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసుకోవాలంటూ విద్యుత్తు శాఖ అధికారులు నోటీసు ఇచ్చారు. ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోకుంటే విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు. కొత్త ట్రాన్స్ఫార్మర్, విద్యుత్తు స్థంభాలు, కేబుల్స్ అన్ని కలిపి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల దాకా ఖర్చు అవుతుందని విద్యుత్తు శాఖ సిబ్బంది చెప్తున్నారు. అంత ఖర్చు మేమెలా భరిస్తాం. విద్యుత్తు శాఖది తప్పుడు నిర్ణయం. దీనిపై ఎంతదాకైనా పోరాటం చేస్తాం. -ఎంఏ హకీమ్, హుమాయూన్‌నగర్, మెహిదీపట్నం