హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : ఎండనకా.. వాననకా శక్తికి మించి రేయింబవళ్లు పనిచేస్తూ కోతల్లేకుండా విద్యుత్తునందిస్తున్న విద్యుత్తు ఇంజినీర్లు, సిబ్బంది శ్రమను వినియోగదారులు గుర్తించాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈ జేఏసీ) కోరింది. సాంకేతిక కారణాలతోనే విద్యుత్తు అంతరాయాలు ఏర్పడుతున్నాయనే తప్ప, ఇందులో తమ నిర్లక్ష్యం ఏమీ లేదని జేఏసీ చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ పీ రత్నాకర్‌రావు, కో చైర్మన్ శ్రీధర్, కో కన్వీనర్ బీసీరెడ్డి, పీ సదానందం స్పష్టంచేశారు. పలు మాధ్యమాల్లో విద్యుత్తు అంతరాయానికి సిబ్బందిని, ఇంజినీర్లను బాధ్యులను చేయడం తమను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.
సిబ్బంది కొరత.. ఉష్ణోగ్రతల్లో మార్పులు.. విద్యుత్తు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో విద్యుత్తు సిబ్బంది రెట్టింపు పనిభారంతో సేవలందిస్తున్న విషయాన్ని అంతా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, గాలివానలతో చెట్లకొమ్మలు విరిగిపడి అంతరాయం ఏర్పడుతుందని, ఈ క్రమంలో తక్షణమే విద్యుత్తు సరఫరాను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. వేసవి డిమాండ్ నేపథ్యంలో టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో 4,353 ట్రాన్స్ఫార్మర్లు అదనంగా ఏర్పాటు చేశామని, మరో 250 వరకు క్షేత్రస్థాయి కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని వివరించారు. ఈ వేసవిలోనూ కోతల్లేకుండా విద్యుత్తునందిస్తున్న సిబ్బందిని, ఇంజినీర్లను ఈ సందర్భంగా జేఏసీ నేతలు అభినందించారు.