మేడ్చల్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని నిర్మాణాల గుర్తింపులో అధికారులు నిమగ్నమయ్యారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల్లో 620 చెరువులు ఉండగా, ఇప్పటికే 97 చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్ల హద్దులను గుర్తించారు. మరో 110 చెరువుల హద్దుల గుర్తింపు కొనసాగుతున్నది.
రెవె న్యూ, ఇరిగేషన్శాఖల అధికారులు సం యుక్తంగా గుర్తిస్తున్నారు. హద్దులు గుర్తించిన చెరువుల సమీపంలో ఎఫ్టీఎల్, బఫర్జోన్లలోని నిర్మాణాల వివరాలను నమో దు చేసుకుంటున్నారు. 97 చెరువులకు గానూ ఇప్పటికే 21 చెరువుల్లో నిర్మాణాల వివరాల సేకరణ పూర్తయినట్టు అధికారుల ద్వారా తెలిసింది. మరో నెల రోజుల్లో మొత్తం నిర్మాణాల నమోదును పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు.
త్వరలోనే లేఅవుట్లకు సంబంధించిన అనుమతి పత్రాలను పరిశీలించేందుకు అధికారులు నోటీసులు జారీచేయనున్నట్టు సమాచారం. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్ల హద్దుల గుర్తింపుతోపాటు నిర్మాణాలను గుర్తిస్తున్న క్రమంలో నిర్మాణాల యజమానుల్లో ఆందోళన నెలకొన్నది. ఇప్పటికే హైడ్రాతో ప్రజలు బెంబేలెత్తుతున్న విషయం తెలిసిందే.