హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ఇండ్ల నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు పంజాబ్ సర్కారు టీఎస్ బీపాస్ అమలుచేయాలని యోచిస్తున్నది. అవినీతి, జాప్యం, నిర్లక్ష్యం, అతిక్రమణలకు తావు లేకుండా నిర్ణీత కాల వ్యవధిలో పారదర్శకంగా ఇండ్లకు అనుమతులు ఇస్తున్న తెలంగాణ తర హా విధానం రూపొందించాలని చూస్తున్నది. టీఎస్‌బీపాస్ గురించి తెలుసుకొన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్.. తమ రాష్ట్రంలోనూ ఈ విధానం అమలుకు అధ్యయనం చేశారు.
టీఎస్‌బీపాస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకొన్నారు. చట్టాన్ని ఏ విధం గా రూపొందించారు? ఇక్కడ ఎలా అమలు చేస్తున్నారు? పంజాబ్‌లో ఏ విధంగా అమలు చేయవచ్చు.. తదితర అంశాలపై అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. త్వరలో పంజాబ్‌లోనూ టీఎస్‌బీపాస్ తరహాలో ఇండ్ల అనుమతుల విధానం అమల్లోకి రానున్నది. తమిళనాడుకు చెందిన అధికారుల బృందం గతంలోనే రాష్ట్రంలో పర్యటించి టీఎస్‌బీపాస్ విధానంపై అధ్యయనం చేసింది. తమిళనాడులో కూడా టీఎస్‌బీపాస్ తరహాలోనే పట్టణాల్లో ఇండ్ల్లకు అనుమతుల జీవో జారీ చేసిం ది. అక్కడ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.
21 రోజుల్లో అనుమతులు
సీఎం కేసీఆర్ టీఎస్‌బీపాస్‌ను 2020 నవంబర్ 16 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. 600 గజాల వరకు స్థలాల్లో లేఅవుట్లు, భారీ భవనాలకు సైతం ఆన్లైన్లో అనుమతులిస్తున్నారు. 21 రోజుల వ్యవధిలో అనుమతి జారీచేస్తున్నారు. 75 గజాల వరకు ఇన్‌స్టాంట్‌గా రుసుం లేకుండా దరఖాస్తు చేయగానే అనుమతులు ఇస్తున్నారు. ఐటీ రాష్ట్రం కర్ణాటకలో, దేశానికి మాడల్‌గా వర్ణించే గుజరాత్లో, పూర్తిగా పట్టణ ప్రాంతమైన ఢిల్లీలో పూర్తిగా ఆన్లైన్లో ఇండ్లకు అనుమతులిచ్చే విధానం లేదు. ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఈ విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టింది తెలంగాణ రాష్ట్రమే.