భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 27: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కేరళ ఉన్నత విద్య, సోషల్ జస్టిస్ మంత్రి ఆర్.బిందు కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని దేశ్ముఖి గ్రామంలో ఉన్న సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కాలేజీలో మంగళవారం దివ్యాంగుల హకుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) మూడో మహాసభ జరిగింది. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దివ్యాంగుల హక్కులను హరిస్తూ వారి సంక్షేమం గురించి పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. హకులు, సాధికారిత, సంక్షేమం కోసం దివ్యాంగులు సమష్టిగా కేంద్రంపై పోరాడాలని పిలుపునిచ్చారు. దివ్యాంగుల హకులు, వారికి కల్పించాల్సిన సదుపాయాల అంశాలను 2020లో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో ఎకడా పేరొనలేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు దివ్యాంగులకు ఆశనిపాతంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్లు, బడా పెట్టుబడిదారులకు రాయితీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. సామాన్యులు, పేద, మధ్య తరగతి ప్రజలు, దివ్యాంగుల జీవనానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోగా భారాలు మోపుతున్నదని విమర్శించారు. దేశంలో 60 శాతానికి పైగా పాఠశాలలకు విద్యుత్తు సౌకర్యం లేదని, అత్యధిక గ్రామీణ పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేదని చెప్పారు. కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్, రాష్ట్ర కార్యదర్శి ఎం.అడివయ్య తదితరులు పాల్గొన్నారు.