తొర్రూరు, ఏప్రిల్ 17: ‘ నా ఇంటికి పెద్ద కొడుకు కేసీఆరే.. మా బతుకుల్లో వెలుగు నింపింది ఆయనే’ అని ఇదగాని లింగమ్మ పేర్కొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ పండుగ సందర్భంగా ఆమె కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెంకు చెందిన ఇదగాని యాకయ్య, లింగమ్మ దంపతుల ఏకైక సంతానం మధుకర్. 2009 డిసెంబర్ ఒకటిన కంఠాయపాలెంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మధుకర్ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణ సాధన తర్వాత మధుకర్ కుటుంబానికి అప్పటి సీఎం కేసీఆర్ మధుకర్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం ఇవ్వడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు.
గురువారం లింగమ్మ మాట్లాడుతూ.. ‘తెలంగాణ కోసం నా కొడుకు ప్రాణం ఇస్తే, మా ఇంటికి ప్రాణం పోసిన కొడుకు కేసీఆర్. నా ఇంటికి పెద్ద కొడుకులా ఉన్నారు. ఆయన దయవల్లే నా కుటుంబం నిలబడగలిగింది. నా భర్తకు పాఠశాలలో అటెండర్‌గా ఉద్యోగం ఇప్పించారు. ఆయన మరణించాక, అదే ఉద్యోగంలో కుమార్తె మౌనిక పనిచేస్తున్నది. నా కుమార్తె వివాహాన్ని కేసీఆర్ అందించిన రూ.10 లక్షలతో వైభవంగా జరిపాం. ఆయనే మా ఇంటికి వెలుగు.. ఆయనే మా భరోసా’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.