హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): శనగపంట సాగుకు కరువు పరిస్థితులను అధిగమించేలా ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి చేశారు. పంటలో కరువుకు ప్రభావితమయ్యే జన్యువులను గుర్తించి వాటిలో మార్పులు చేశారు. దీంతో మరింత సామర్థ్యాన్ని పొంది అధిక దిగుబడులు పొందవచ్చని నిరూపించారు. ఆరుతడి పంటలుగా సాగుచేసే శనగలకు కరువు పరిస్థితులు తీవ్రప్రభావం చూపుతాయి. ఏమాత్రం వాతావరణంలో మార్పులు కలిగినా తీవ్ర పంటనష్టం జరుగుతుంది. ఇలాంటి దశలో శనగ పంటలోని ఐదు ప్రధాన జన్యువులను గుర్తించారు.
ఐసీసీ 4958, జేజీ 11, జేజీ 11+ఐఎల్, ఐసీసీ 1882ను సంకరణం చేశారు. వాటి జన్యు మార్పిడి జరిగి కరువు పరిస్థితులను తట్టుకొనే లక్షణాలు పెరిగినట్టు తేల్చారు. పలు విధాలుగా శనగలోని ప్రొటీన్ పదార్థాన్ని సేకరించి జీనోమిక్స్ విధానంతో మార్పులు చేయడంతో కరువు పరిస్థితులకు విరుద్ధంగా మొక్క స్పందించినట్టు గుర్తించారు. వీటిలో మార్పులు చేయడంతో కరువు ప్రభావిత పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని వెల్లడించారు. విత్తనం నాటిన తర్వాత మొలక దశకు చేరుకొన్న 25 రోజుల్లోపు జన్యు క్రమంపై అధ్యయనం చేసి సంకరణం చేయడంతోనే మెరుగైన ఫలితాలు వచ్చినట్టు ఇక్రిసాట్ పరిశోధకులు పేర్కొన్నారు.