ఐసీఏఆర్- ఎన్ఆర్సీఎం, ఎల్వికాన్, హెచ్సీయూ మధ్య ఎంవోయూ
కొండాపూర్, జూన్ 30 : గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ – నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ (ఐసీఏఆర్ – ఎన్ఆర్సీఎం), ఎల్వికాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మధ్య గురువారం ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ఆహార పదార్థాలు, ముఖ్యంగా మాంసాహార ఉత్పత్తుల నాణ్యతను కాపాడటంతోపాటు వ్యర్థాలను తగ్గించేందుకు ‘బెస్ట్ బిఫోర్ డేట్’ స్మార్ట్ సెన్సార్ విధానాన్ని ఉపయోగిస్తారు. దీని ద్వారా వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందిస్తారు.
హెచ్సీయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ బీజే రావు సమక్షంలో గురువారం వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ దేవేశ్ నిగమ్, ఐసీఏఆర్ – ఎన్ఆర్సీఎం డైరెక్టర్ డాక్టర్ ఎస్బీ బార్బుద్దే, ఎల్వికాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ ఏ రాంబాబు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగేంద్ర కుమార్ సూర్యదేవర, డీన్ కోఆర్డినేటర్ ఆఫ్ ఎంఓయూ ప్రొఫెసర్ చక్రవర్తి భగవతి, ఐసీఏఆర్ – ఎన్ఆర్సీఎం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సురేశ్ కే దేవత్కల్ తదితరులు పాల్గొన్నారు.