హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): విజయ డెయిరీ ఉత్పత్తుల అమ్మకాలను మరింతగా పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 50% సబ్సిడీతో ఐస్‌క్రీమ్ ఫుష్కార్ట్లను (ట్రై సైకిళ్లను), ఫ్రీజర్లను అందించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సూచించారు. వీటి ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించి అమ్మకాలు పెరుగుతాయని పేర్కొన్నారు. సోమవారం ఆయన మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో జరిగిన తెలంగాణ విజయ డెయిరీ బోర్డు 14వ సమావేశంలో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఏర్పాటుచేసే మెగా డెయిరీ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. పాలసేకరణ, ఉత్పత్తుల మారెటింగ్కు అవసరమైన సిబ్బందిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకోవాలని సూచించారు. విజయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కొత్త ఔట్లెట్లను ప్రారంభించాలని ఆదేశించారు. పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాల వద్ద విక్రయ కేంద్రాలను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. మేడారం, కొమురెల్లి జాతరలలో తాతాలిక ఔట్లెట్లను ఏర్పాటుచేయాలని సూచించారు. ఔట్లెట్లలో ఇతర డెయిరీల ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు ప్రతి 7 రోజులకోసారి బిల్లులు చెల్లించాలని ఈ సమావేశం తీర్మానించింది. విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి, విజయ డెయిరీ ఎండీ అనితా రాజేంద్ర, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, జీఎం కామేశ్, మారెటింగ్ జీఎం మల్లికార్జున్ పాల్గొన్నారు.