హైదరాబాద్, జూలై19 (నమస్తే తెలంగాణ): ఇచ్చంపల్లి ప్రాజెక్టు మళ్లీ తెరమీదకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై కసరత్తును ప్రారంభించింది. సర్వే చేయించేందుకు సిద్ధమవుతున్నది. అయితే ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును తెరమీదకు తీసుకువచ్చిన నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఇచ్చంపల్లి ప్రాజెక్టును ముందుకు తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బనకచర్లకు అనుమితిస్తే 200 టీఎంసీలను ఇచ్చంపల్లి నుంచి వినియోగించుకునేందుకు తెలంగాణకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డిమాండ్‌ను ముందు పెట్టింది. వాస్తవంగా గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) పోలవరంతోపాటు, సుబోధ్ఘాట్, భూపాలపట్నం, ఇచ్చంపల్లి ప్రాజెక్టులకు సైతం 1980లోనే ఆమోదముద్ర వేసింది.
ఇక ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు 85టీఎంసీలను కేటాయించింది. ఈ మేరకు అప్పటి ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం కుదిరింది. ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ (ఫుల్ రిజర్వాయర్ లెవల్)ను నిర్ణయించలేదు. దీనిపైనే అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతూ వచ్చాయి. ఉమ్మడి ఏపీ పాలకులు సైతం పట్టించుకోలేదు. 125మీటర్లతో మొదలై 118 మీ, 112మీ, ఆ తర్వాత 108మీటర్లు, 95 మీటర్లకు కుదిస్తూ వచ్చారు. అయితే అప్పటికే తెలంగాణతోపాటు, పొరుగు రాష్ర్టాల్లో భారీ ముంపు వాటిల్లే నేపథ్యంలో ఉమ్మడి పాలకులు ప్రాజెక్టును పూర్తిగా అటకెక్కించారు.
ఉద్యమ డిమాండ్లలో ఇచ్చంపల్లి కూడా ఒకటిగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్‌పై 2016 వరకు చర్చలు కొనసాగాయి. అప్పటికీ పొరుగు రాష్ర్టాల అభ్యంతరాలు, భారీ ముంపు, తక్కువ ఎత్తుతో నిర్మిస్తే ప్రాజెక్టు లైవ్ స్టోరేజీ తక్కువగా ఉండటం తదితర అనేక సాంకేతిక సమస్యల కారణంగా ముందుకుసాగలేదు. ఈ నేపథ్యంలోనే ఇచ్చంపల్లి దిగువన 83 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో సమ్మక్కసాగర్ వద్ద బరాజ్‌ను నిర్మించడంతో ఇచ్చంపల్లి ఆవశ్యకత తగ్గిపోయింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గోదావరి-కావేరి రివర్ లింకింగ్ ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించి వరదను మళ్లించాలని 1982లోనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 2019లో నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను సమర్పించింది.
87 మీటర్ల ఎత్తుతో 15 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బరాజ్‌ను నిర్మించాలని ప్రతిపాదించింది. తద్వారా ఛత్తీస్‌గఢ్ వాడుకోని నికర జలాల్లో 148 టీఎంసీలను తరలించాలని ప్రపోజ్ చేసింది. కానీ, గోదావరి బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలూ ఈ ప్రాజెక్టుకు అభ్యంతరం తెలుపుతూ వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో సమ్మకసాగర్ బరాజ్ ఉండటంతో.. అకడి నుంచే తీసుకోవాలని గత ప్రభుత్వం నుంచీ వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఇచ్చంపల్లి వద్ద కడితే సమ్మకసాగర్ బరాజ్ (తుపాకులగూడెం) మధ్యన 27 కిలోమీటర్ల దూరమే ఉంటుంది కాబట్టి.. వచ్చే వరదను నియంత్రించే పరిస్థితులు ఉండవన్న వాదన ఉంది. దీంతో పాటు దేవాదుల, సీతమ్మసాగర్ వంటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం చేసింది. బనకచర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడును తగ్గించేందుకు ఇచ్చంపల్లి ఉపయోగపడుతుందని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించి పీఎఫ్ఆర్ను రూపొందించేందుకు సర్వే నిర్వహించాలని, ఆ బాధ్యతలను వ్యాప్కోస్‌కు అప్పగించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.