ఇబ్రహీంపట్నం, నవంబర్ 2: గాంధీభవన్‌లో ఆందోళన పర్వం ఆగట్లేదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నాడని ఆరోపిస్తూ నిత్యం ధర్నాలు, ఫ్లెక్సీ దహనాలు జరుగుతూనే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన సీనియర్ నాయకుడు దండెం రాంరెడ్డి తన అనుచరులతో కలిసి గురువారం హంగామా చేశారు. ధర్నా చేసి, గాంధీభవన్ కార్యాలయానికి తాళం వేశారు. రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీలను చింపివేసి దహనం చేశారు. అనంతరం రాంరెడ్డి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం టికెట్ తనకే కేటాయిస్తామని చెప్పి రేవంత్ తనచేత పెద్దఎత్తున డబ్బులు ఖర్చుపెట్టించాడని ఆరోపించారు. ఇబ్రంహీంపట్నం బీఫామ్ తనకు ఇవ్వకుంటే రెబల్‌గా పోటీచేసి సత్తా చూపిస్తానని హెచ్చరించారు. అదేసమయంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి, నాయకులు పాశం లక్ష్మీపతిగౌడ్, కోదండరెడ్డి, ఇతర నాయకులతో కలిసి ఇబ్రహీంపట్నంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు మర్రి నిరంజన్‌రెడ్డి కూడా తనకే బీఫామ్ వస్తుందని నమ్మకంతో ఉన్నారు. దీంతో ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పరిస్థితి మూడు గ్రూపులుగా తయారైంది.