హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ)/నాంపల్లి క్రిమినల్ కోర్టులు: పైరసీ సినిమా వెబ్సైట్ ఐబొమ్మ కేసులో అరెస్టయిన ఇమ్మడి రవి పోలీసు కస్టడీ ముగిసింది. దీంతో పోలీసులు సోమవారం సాయంత్రం వైద్య పరీక్షల అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రవి కస్టడీలో కీలక విషయాలు రాబట్టిన పోలీసులు.. త్వరలోనే మరిన్ని అరెస్ట్‌లు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఆయా వివరాలను పోలీసులు కోర్టుకు తెలుపగా, రవి జ్యుడీషియల్ రిమాండ్‌ను జనవరి 6 వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. 5 కేసుల్లో రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై మంగళవారం కోర్టు విచారణ చేపట్టనున్నది.