హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : సినిమా పైరసీ కేసులో ‘ఐబొమ్మ’, ‘బప్పంటీవీ’ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసి గంటలైనా గడవకముందే ఇంటర్నెట్లో కొత్తగా ‘ఐబొమ్మ వన్’ వెబ్సైట్ వెలుగులోకి వచ్చింది. ఐబొమ్మ మాదిరిగానే అందులోనూ కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సినిమాపై క్లిక్‌చేస్తే మరో వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతూ ‘మూవీరూల్స్’కు కనెక్ట్ అవుతున్నది. దీంతో అక్కడ కావాల్సిన సినిమాలను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీంతో పోలీసులకు కొత్త తలనొప్పి మొదలైంది. సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. ‘ఐబొమ్మ ఎకో సిస్టం’లో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయని, ఎవరో ‘ఐబొమ్మ వన్’ను ప్రచారంలోకి తీసుకొచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఐబొమ్మ రవి ఓటీటీలోనే విడుదలైన సినిమాలనే బప్పం టీవీలో పెడుతున్నాడని, ‘మూవీరూల్స్’, ‘తమిళ్ ఎంవీ’ వెబ్సైట్లు సినిమా విడుదలైన రోజే నెట్లో పెడుతున్నాయని చెప్తున్నారు. వారిని కూడా అరెస్ట్ చేయాలని కోరుతున్నారు.