హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : హెచ్‌సీయూ అంశంపై ఓ ట్వీట్‌ను రీపోస్టు చేసినందుకు గచ్చిబౌలి పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. హెచ్‌సీయూలో పెద్దఎత్తున అటవీ విధ్వంసంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసిన అంశాన్ని ‘లైవ్ లా ఇండియా’ మీడియా సంస్థ ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ‘తెలంగాణలోని కంచె గచ్చిబౌలి ప్రాంతంలో పెద్దఎత్తున చెట్ల నరికివేతకు సంబంధించిన కేసులో, ఆ స్థలంలో యథాతథ స్థితిని పునరుద్ధరించడం కోర్టు మొదటి ప్రాధాన్యత. ఈ అంశంలో రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణాధికారి వెంటనే చర్యలు తీసుకోవాలి. కంచె గచ్చిబౌలిలో తక్షణం 100 ఎకరాల్లో చెట్లను పునరుద్ధరించాలి. లేకపోతే అధికారులను జైలుకు పంపాల్సి ఉంటుంది’ అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని పేర్కొంది. ఆ మీడియా సంస్థ ఎక్స్ పోస్ట్‌ను స్మితాసబర్వాల్ తనఖాతాలో రీపోస్ట్ చేశారు. హెచ్‌సీయూ విషయంలోనే రీట్వీట్ చేసినందుకు ఇప్పటికే తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చినా ఆమె ధైర్యంగా తన భావాలు వ్యక్తంచేశారని నెటిజన్లు కొనియాడుతున్నారు. మరోవైపు తనకు పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్మితాసబర్వాల్ స్పందించలేదు.