హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 18 మంది ఐఏఎస్‌లు, 23 మంది ఐపీఎస్‌లు, 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ బుధవారం సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. వీరితోపాటు మరో 8 మంది ఐఏఎస్ అధికారులకు ఇతర శాఖల పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కుమార్తె సర్వే సంగీతను సీఎం కార్యాలయంలో సీఎం సంయుక్త కార్యదర్శిగా నియమించింది.
గతంలో సీఎం కార్యదర్శిగా ఉన్న స్మితాసబర్వాల్‌ను ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. రాహుల్ బొజ్జా, దాసరి హరిచందనకు రెండు వారాల్లోనే మరోసారి స్థానచలనం కల్పించింది. సీఎంవో కార్యదర్శిగా ఉన్న రాహుల్ బొజ్జాను జీఏడీ కార్యదర్శిగా గత నెల 17న, ఆయుష్ డైరెక్టర్‌గా ఉన్న హరిచందనను ప్రజావాణి నోడల్ ఆఫీసర్‌గా గత నెల 18న ప్రభుత్వం నియమించింది. రెండు వారాల్లోనే మరోసారి బదిలీ చేసింది. ప్రజావాణి నోడల్ ఆఫీసర్‌గా డీ దివ్యను నియమించగా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావుకు జీఏడీ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ బాధ్యతలను డీఐజీ రెమా రాజేశ్వరికి ప్రభుత్వం అప్పగించింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్‌గా ఉన్న వీవీ శ్రీనివాసరావును టెక్నికల్ సర్వీసెస్ డీజీపీగా బదిలీ చేసింది.



