ఐఏఎస్‌లకు ఏసీ జబ్బు పట్టిందని.. ఒక్క తప్పు చేయమంటే, మూడు తప్పులు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సీఎం వ్యాఖ్యలపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు లోలోపల రగులుతున్నట్టు సమాచారం. అందరూ అవినీతిపరులే అన్నట్టుగా ముద్రవేయడంపై వారు మండిపడుతున్నారు.
Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ) : ‘ఇప్పటి సివిల్ సర్వెంట్స్ ఏసీ రూముల్లోంచి బయటకు వచ్చేందుకే నిరాకరిస్తున్నరు. కొత్త ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సమాజంలో మంచిని కాకుండా చెడునే రోల్‌మాడల్‌గా తీసుకుంటున్నరు. మేము ఒక్క తప్పు చేయాలని చెప్తే.. మూడు చేద్దాం అంటున్నరు. ట్రైనింగ్‌లోనే పోలీస్ స్టేషన్లకు వెళ్లి సివిల్ పంచాయితీలు తెంచుతున్నరు’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీఎం స్థాయిలో ఉండి తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని మండిపడుతున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై వారి వారి అసోసియేషన్లలో అంతర్గతంగా చర్చించుకుంటూ ‘మేమంతా అవినీతి పరులమనే విధంగా ముద్ర వేయడం ఏమిటి.. ఒక తప్పు చెయ్యాలని చెప్తే.. మూడు తప్పులు చేద్దామంటున్నరని అనడం ఏమిటి? ఎన్ని తప్పులు చేశామో? ఎక్కడ చేశామో? చూ పించండి.. మీ రాజకీయ అసమర్థతను మాపై నెట్టాలని చూస్తారా?’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్టు సమాచారం. తాము ఏమీ చేయకుండానే ప్రభుత్వం, పాలన నడుస్తున్నదా? అని, ఎంత కష్టపడినా ఇంతేనా, ప్రయోజనం లేదా? అని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది.
సివిల్ సర్వెంట్స్‌పై సీఎం రేవంత్ వ్యా ఖ్యలు రాజకీయ, అధికారవర్గాల్లో చర్చకు దారితీశాయి. ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఆయ న పట్టు కోల్పోయారని, ఆయన మాటలను ఎవరూ ఖాతరు చేయడం లేదని, అందుకే తన అసంతృప్తిని వెళ్లగక్కినట్టు తెలుస్తున్నదని గుసగుసలు వినిపిస్తున్నా యి. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందనే అంశంపైనా ఆరాలు తీస్తున్నారు. ఆదివారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రచించిన పుస్తకావిష్కరణలో సీఎం ఐఏఎస్, ఐపీఎస్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు ఏసీ రూముల్లోంచి బయటకు రావటం లేదని, మాట వినడం లేద ని, సెటిల్మెంట్స్ చేస్తున్నారని మాట్లాడారు.
వాస్తవానికి ప్రభుత్వం, పాలనలో ఐఏఎస్, ఐపీఎస్‌లది అత్యంత కీలకపాత్ర. అలాంటి వారిపై సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా ఐఏఎస్, ఐపీఎస్‌లకు సీఎం రేవంత్‌కు మధ్య పొసగడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. ఇందులో భాగంగానే సీఎం అధికారులపై అసంతృప్తితో ఉన్నట్టు చర్చించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని తాను పదే పదే చెప్పినా, సీఎస్‌తో చెప్పించినా ప్రయోజనం లేదని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఆయ న కోపంగా ఉన్నట్టు తేలిపోయింది. వీరిపై కోపం తీర్చుకునేందుకు సీఎంకు పుస్తకావిష్కరణ వేదికగా లభించిందనే చర్చ నడుస్తున్నది. అందుకే సీనియర్ బ్యూరోక్రా ట్స్, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ అంతా ఒకచోట ఉండగానే సివిల్ సర్వెంట్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై తనలో నెలకొన్న అసంతృప్తిని, కోపాన్ని తీర్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.