
హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరుతున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం శనివారం ప్రారంభం కాబోతున్నది. ఉదయం 10.30 గంటలకు నానక్‌రాంగూడలోని ఫీనిక్స్ వీకే టవర్స్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హిమాకోహ్లీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొననున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐ అయ్యాక తొలిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు జూన్ 15న సీఎం కేసీఆర్ వద్ద ఐఏఎంసీ ఏర్పాటు అంశాన్ని ప్రతిపాదించారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఆరు నెలల్లోనే ఐఏఎంసీ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యింది. సీఎం స్పందించిన తీరుతోపాటు మంత్రి కేటీఆర్, పలువురు అధికారులు సాగించిన కృషిని జస్టిస్ రమణ ప్రత్యేకంగా ప్రశంసించారు. హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్న ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రపంచంలోనే ఆరవది. తొలిసారి 1926లో ప్యారిస్‌లో తొలి ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటైంది. ఆ తర్వాత లండన్, సింగపూర్, హాంకాంగ్, జెనీవాల్లో ఏర్పాటయ్యాయి.
నేడు రామప్పకు సీజేఐ
ఐఏఎంసీని ప్రారంభించాక రోడ్డు మార్గం ద్వారా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయ దర్శనానికి సీజేఐ జస్టిస్ రమణ వెళ్తారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య రామప్పగుడితో పాటు రామప్ప చెరువును సందర్శిస్తారు. రాత్రి వరంగల్‌లోని ఎన్ఐటీ అతిథిగృహంలో బస చేస్తారు. రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విందుకు హాజరవుతారు. ఆదివారం ఉదయం భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య వరంగల్‌లోని కోర్టుల సముదాయాన్ని ప్రారంభిస్తారు. అదేరోజు సాయంత్రం షామీర్పేటలోని నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. సోమవారం తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.