Lenin | అక్కినేని అఖిల్ హీరోగా దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ‘లెనిన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెరికాలో తెల్లవారుజామున ప్రీమియర్ షోలు ప్రదర్శించగా, అక్కడి ప్రేక్షకుల నుంచి మొదటి స్పందన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా అఖిల్ కెరీర్లో ఇది ఒక కీలకమైన సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. తొలి షోల తర్వాత వస్తున్న రిపోర్టులు చిత్రంపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి.సినిమా ప్రారంభంలో వినిపించే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ప్రేక్షకులను వెంటనే కథలోకి తీసుకెళ్తోందని ప్రీమియర్ చూసిన వారు చెబుతున్నారు. కథలోని ప్రధాన అంశాన్ని ఎన్టీఆర్ తన గంభీరమైన గళంతో పరిచయం చేసిన తీరు సినిమాకు మంచి హైప్‌ను తీసుకొచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.
ఈ సినిమాతో అఖిల్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు ఎక్కువగా క్లాస్ ఇమేజ్‌తో కనిపించిన అఖిల్, ఈసారి రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో మాస్ క్యారెక్టర్లో ఆకట్టుకున్నాడని అంటున్నారు. నటుడిగా తనలోని కొత్త కోణాన్ని బయటకు తీసుకొచ్చాడని, కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్లలో ఇది ఒకటిగా నిలుస్తుందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో అఖిల్ కెమిస్ట్రీ మరో ప్రధాన ఆకర్షణగా నిలిచిందని టాక్ వినిపిస్తోంది. విడుదలకు ముందే పాటల్లో వీరిద్దరి జోడీకి మంచి స్పందన రాగా, సినిమాలోనూ వారి లవ్ ట్రాక్ సహజంగా సాగిందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్‌లో ప్రేమకథతో పాటు స్నేహానికి సంబంధించిన సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా తెరకెక్కించారని సమాచారం.
తొలి గంటలో దర్శకుడు ప్రధాన పాత్రలు, కథా నేపథ్యాన్ని పరిచయం చేయడంపై దృష్టి పెట్టారని, ప్రీ-ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత సినిమా పూర్తిగా మరో మలుపు తిరుగుతుందని ప్రీమియర్ రిపోర్టులు చెబుతున్నాయి. ముఖ్యంగా రెండో భాగంలో కథ వేగంగా ముందుకు సాగడంతో పాటు, వరుస ట్విస్టులు ఆసక్తిని పెంచాయని అంటున్నారు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని, దర్శకుడు కథను ముగించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుందని సోషల్ మీడియాలో స్పందనలు వస్తున్నాయి.
సంగీత దర్శకుడు ఎస్. థమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ముఖ్యమైన ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాల్లో ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలం చేకూర్చిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ నటుడు శివాజీ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించగా, ఆయన నటనకు కూడా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. కథలో ఆయన పాత్రకు మంచి ప్రాధాన్యం ఉందని, తన అనుభవంతో పాత్రను మరింత బలంగా నిలబెట్టారని తొలి షోలు చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.
అమెరికా ప్రీమియర్ షోల అనంతరం సోషల్ మీడియాలో వస్తున్న ఫస్ట్ రెస్పాన్స్ ఎక్కువగా సానుకూలంగానే ఉన్నాయి. అయితే ఇవి కొందరి అభిప్రాయాలు మాత్రమే. సినిమా పూర్తి విజయంపై స్పష్టత రావాలంటే అన్ని ప్రాంతాల నుంచి ప్రేక్షకుల స్పందన, బాక్సాఫీస్ ఫలితాలు రావాల్సి ఉంది. అయినప్పటికీ, ‘లెనిన్’తో అఖిల్ అక్కినేని తన కెరీర్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు తొలి టాక్ సూచిస్తోంది.